Saveera Parkash:ఆర్థికపరమైన ఇబ్బందుల్ని కొంత కాలంగా ఎదుర్కొంటున్న పాకిస్థాన్ త్వరలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ జాతీయ అసెంబ్లీతో పాటు ప్రొవిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ బరిలోకి దిగడం విశేషం. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని బునేర్ జిల్లా నుంచి డా. సవీరా పర్కాశ్ ఎన్నికల బరిలో దిగారు. పీకె -25వ స్థానానికి ఆమె తాజాగా నామినేషన్ దాఖలు చేశారు.
జనరల్ స్థానాల్లో తప్పనిసరిగా ఐదు శాతం మహిళా అభ్యర్థులు ఉండాలని పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఇటీవల కీలక సవరణలు చేసింది. ఈ క్రమంలోనే బునేర్ జిల్లాలోని జనరల్ స్థానం నుంచి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ టికెట్‌పై సవీరా పోటీ చేస్తున్నారు. బునేర్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి మహిళ కూడా ఈమే కావడం విశేషం.
ఇంకీ ఎవరీ సవీరా పర్కాశ్…?
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునేర్ జిల్లా అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి సవీరా పర్కాశ్ 20022లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె తండ్రి ఓం ప్రర్కాష్ రిటైర్డ్ డాక్టర్. బిలావల్ బుట్టో జర్దారీ నేతృత్వం వహిస్తున్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే సవీరా కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె బునేర్‌లో పీపీపీ మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీచేస్తుండగా, ఇందులో దాదాపు 3000 మంది మహిళలు ఉన్నారు. అయితే హిందూ కమ్యూనిటీకి చెందిన ఏకైక మహిళ మాత్రం సవీరానే. ముస్లీం ప్రాబల్యం అధికంగా ఉన్న బునేర్ నుంచి ఆమె పోటీ చూస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఆమెకు పలువురు హక్కుల కార్యకర్తలు, సోషల్ మీడియా ఇన్‌వ్లూయెన్సర్లు మద్దతు ప్రకటిస్తున్నారు.