JAISW News Telugu

Save the Tigers : ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 రివ్యూ.. సమ్మర్ లో కాస్త కాలక్షేపం..

Save the Tigers

Save the Tigers

Save the Tigers : ఇప్పుడంతా వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ఇప్పటికే సినిమాలకు దీటుగా ఇవి మారిపోయాయి. పెద్ద హీరోల సినిమాలకు, బ్లాక్ బస్టర్ సినిమాలకు మాత్రమే థియేటర్లలోకి వెళ్లి చూసే రోజులు వచ్చాయి. ఇక మిగతా సినిమాలన్నీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లకే పరిమితం కానున్నాయి. థియేటర్ల కన్నా ఎక్కువ మందిని వారి ఇంట్లోనే ఎంటర్ టైన్ చేయడం ఓటీటీతోనే సాధ్యమవుతోంది. దీంతో సినిమా నటులు కూడా వెబ్ సిరీస్ ల వైపునకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే పలు తెలుగు వెబ్ సిరీస్ లు సినిమాల కన్నా ఎక్కువ ఆదరణకు నోచుకున్నాయి. ఆ కోవకు చెందిందే ‘సేవ్ ది టైగర్స్’.

వెబ్ సిరీస్ లను సీజన్ల వారీగా కొనసాగించడం అంతా ఈజీ కాదు. సీరియల్స్ లా సాగదీయలేం.. సినిమాల్లో రెండున్నర గంటల్లో ముగించనూ లేం. వెబ్ సిరీస్ కు ఉన్న ప్రత్యేకత ఇదే. దీని లైన్ ను గట్టిగా పట్టుకున్నామా హిట్ కొట్టినట్టే. గతేడాది రిలీజైన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ బాగా ఆకట్టుకుంది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలతో మహి వి. రాఘవ్ షో రన్నర్ గా  వచ్చిన ఈ సిరీస్ నవ్వులు పూయించింది. మళ్లీ ఇప్పుడు సీజన్ 2 ‘డిస్నీ+ హాట్ స్టార్’ లోకి వచ్చింది. మరి ఈ సీజన్ ఎలా ఉంది? మరో సీజన్ కు అవకాశం ఉందా? ఒక్క సారి చూద్దాం..

సీజన్ 2లో ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి, చివరి ఎపిసోడ్స్ తప్పితే మిగతా ఎపిసోడ్లను ఫిల్లర్ లా అనిపిస్తాయి. తొలి సీజన్ హిట్ కావడానికి కారణం అందులోని సహజత్వం. ముగ్గురు జీవితాల్లోని సంఘటనలను ఆహ్లాదకరంగా చిత్రీకరించి ఇవన్నీ మన ఫీలింగ్స్ అన్నట్టుగా చూపించి ఆ పాత్రలో ప్రయాణం చేసేలా చేశారు. కానీ ఎప్పుడైతే ఈ ముగ్గురి కథలోకి ఓ హీరోయిన్ ను ప్రవేశపెట్టారో అప్పుడే వ్యవహారమంతా అర్టిఫీషియల్ అయిపోయింది.

కథ నేల విడిచి సాము చేసింది. ఈ హీరోయిన్ ట్రాక్ తో నడిచే సన్నివేశాలన్నీ చాలా సినిమాలను గుర్తుకుతెస్తాయి. ఇందులో కంటెంట్ లేదనే సంగతి సెకండ్ ఎపిసోడ్ లో వచ్చే సైకాలజిస్ట్ ట్రాక్ చూస్తే అర్థమవుతుంది. ఆ ట్రాక్ అస్సలు వర్కవుట్ కాలేదు. భర్తలపై అనుమానాలు పెంచేలా చిత్రీకరించిన ఆ వ్యవహారమంతా అనవసరంలాగా అనిపిస్తుంది.

అపార్ట్ మెంట్ లో రాహుల్ పెట్స్ తో పడే ఇబ్బందులను ఒక ఎపిసోడ్ గా చూపించారు. ఆ గొడవ, పనిమనిషి చేసే హంగామా జబర్దస్త్ స్కిట్లను గుర్తుచేస్తుంది. పెళ్లి కాన్సెప్ట్ ఎలా ఎలా మొదలైందనే విషయాన్ని చూపించడానికి పూర్వంలోకి వెళ్లి ఏదో ఆల్ఫా మేల్ తరహాలో ఒక ఎపిసోడ్ పెట్టారు. అందులోనూ ఫన్ పండలేదు. పైగా ఆ ఎపిసోడ్ ని తీసిన విధానం, గెటప్స్ అదోలా ఉన్నాయి. ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అనే ఎపిసోడ్ ఒకటి పెట్టారు. సీజన్ లో కంటెంట్ లేనప్పుడు ఏదో ఒక ఈవెంట్ పెట్టి నటులంతా స్టేజీపై డ్యాన్సులు వేసుకుంటూ సంబురపడుతారు.

ఇది అలాంటి ఎపిసోడే. ఇక ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసరికి జోనర్ ఎమెషన్ కు షిఫ్ట్ అయిపోతుంది. అప్పటి వరకూ నవ్వులు లేకుండా సమయం వృథా జరిగిందని గ్రహించినట్టు ఉన్నారు. చివరి ఎపిసోడ్ ను ఎమోషన్ తో పిండేయాలని చూశారు. సిరీస్ జోనర్ కు సంబంధం లేకుండా ముగ్గురికి మూడు ఎమోషనల్ టచ్చింగ్ ఇచ్చి దీనికి ఇంకా కొనసాగింపు ఉందనే కోణంలో సీజన్ ముగించారు.

ఉన్నంతలో ప్రియదర్శి ట్రాక్ బెటర్. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనే హైమా ముచ్చట చుట్టూ నడిపిన కొన్ని సీన్స్, పెద్దమనుషుల పంచాయితీ నవ్వులు పంచాయి. గత సీజన్ లో రాహుల్, పనిమనిషి రోహిణి ట్రాక్ కామెడీ పండించింది.  అయితే సీరత్ కపూర్ ట్రాక్ పై కొద్దిగా శ్రద్ధ పెడితే ఇంకా బాగా వచ్చేది.

ఇక నేపథ్య సంగీతం, కెమెరా పనితనం డీసెంట్ గా ఉన్నాయి. దర్శకుడు అరుణ్ కొత్తపల్లి ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. సినిమా నటులంతా చేసిన వెబ్ సిరీస్ కాబట్టి దీనికి ఓ క్రేజ్ అయితే వచ్చింది. ‘సేవ్ ది  టైగర్స్ ’ లా అద్యంతం నవ్వులు పంచకపోయినా అక్కడక్కడ కాస్త కాలక్షేపం అయితే దొరుకుతుంది.

Exit mobile version