Saudi Arabia : కింగ్‌డమ్ ఆఫ్ సౌదీ అరేబియా డొమెస్టిక్ వర్క్ వీసా తీసుకునేవారికి కొత్త కండీషన్ పెట్టింది. పెళ్లికాని సౌదీ పౌరులు యజమానులుగా విదేశీ గృహ కార్మికులను నియమించుకోవాలంటే ఇకపై వర్క్ వీసా పొందాలనుకేవారికి 24 ఏళ్లు నిండి ఉండాలనే షరతు పెట్టింది. సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ముసానెడ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ ప్రకటనను వెలువరించింది. కొత్త రూల్ ప్రకారం సౌదీకి చెందిన వారు, గల్ఫ్ దేశాల పౌరులు, దేశ పౌరుల భార్యలు, దేశ దేశాల పౌరుల అమ్మలు, ప్రీమియం రెసిడెన్సీ ఉన్న వారు వారి ఆర్థిక స్థితిగతులను బట్టి డొమెస్టిక్ వర్క్ వీసా ఇవ్వచ్చు.
ఇక, ఈ డొమెస్టిక్ వర్క్ వీసా అర్హతలకు సంబంధించి సమాచారం ముసానెడ్ ప్లాట్ ఫారమ్‌లో పెట్టినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా, మొదటిసారి వీసా జారీ చేయాలంటే కనీస నెలవారీ వేతనం 40 వేల సౌదీ రియాల్స్ (రూ.8.88లక్షలు) ఉండాలి. ఇదిలా ఉంటే.. కింగ్‌డమ్‌లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మెరుగుపరచడం, వివాదాలను పరిష్కరించడం, కార్మికుడు, యజమాని హక్కుల పరిరక్షణ లక్ష్యంగా గృహ సేవలతో పాటు గృహ ఉపాధి కార్యక్రమాల కోసం మంత్రిత్వ శాఖ ముసానేడ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.
ఈ షరతు కొంత వరకు ప్రవాసులకు కలిసి వచ్చేలా కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. సౌదీకి అన్ని దేశాలకంటే ఇండియా నుంచే ఎక్కువగా కార్మిక వీసాపై వెళ్తుంటారు. ఇది వారికి ఎంతో కొంత లాభిస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.