Saudi Arabia : ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. అక్టోబరు 1వ తేదీన ఇరాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. అయితే ఈ ప్రతీకార దాడులను సౌదీ అరేబియా ఖండించింది. మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు మరింత తీవ్రతరం కావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
అక్టోబరు 1వ తేదీన ఇరాన్ భారీ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. వీటిల్లో కొన్ని లక్ష్యాలకు అత్యంత సమీపంలో పడ్డాయి. మిగిలినవాటిని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయి. దీనికి ప్రతీకార చర్య తప్పదని టెల్ అవీవ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. టెహ్రాన్ పై దాడులకు ఇజ్రాయెల్ సైన్యాన్ని సిద్ధం చేసిందనే వార్తలు ఆందోళనను రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేయడం గమనార్హం.