Satya Nadella Salary : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల వేతనం 63 శాతం పెరిగినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగులో తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్ డాలర్ల వేతనం అందుకోనున్నట్లు పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన అందుకున్న 48.5 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 63 శాతం ఎక్కువ. జూన్ తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో దూసుకెళ్లింది. దీంతో కంపెనీ షేర్లు దాదాపు 31.2 శాతం లాభపడ్డాయి. అలా మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లను దాటింది. దీంతో నాదెళ్ల స్టాక్ అవార్డులు 39 మిలియన్ డాలర్ల నుంచి 71 మిలియన్ డాలర్లకు పెరిగాయి. కృత్రిమ మేధ రేసులో రాణించేందుకు కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలో పెట్టుబడులు పెట్టింది.
మైకోసాఫ్ట్ లో అందించిన సేవలకు గానూ నాదెళ్లకు 5.2 మిలియన్ డాలర్లు నగదు ప్రోత్సాహకం అందనున్నట్లు కంపెనీ ఫైలింగ్ తెలిపింది. అయితే తనకు రావలసిన 10.7 మిలియన్ డాలర్ల కంటే ఇది తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా ప్రోత్సాహకం తగ్గినట్లు తెలుస్తోంది.