కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి సంజయ్ మూర్తి
Sanjay Murthy : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా ఏపీకి చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. కాగ్ కు చీఫ్ గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను 15వ కాగ్ గా నియమించినట్లు కేంద్రం వెల్లడించింది. సంజయ్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరపున అమలాపురం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలు అందించారు.
సంజయ్ మూర్తి 24 డిసెంబరు 1964లో జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సెప్టెంబరు 2021 నుంచి జాతీయ ఉన్నత విద్య కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆయన వచ్చే నెలలో ఉద్యోగం నుంచి విరమణ పొందాల్సి ఉండగా ఆయన సేవలను మెచ్చిన ప్రభుత్వం కాగ్ గా నియమించింది. గరిష్ఠంగా ఆరేళ్లు, లేదంటే 65 ఏళ్ల వయసు వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత కాగ్ గిరీశ్ చంద్ర పదవీకాలం త్వరలో ముగియనుంది.