Sandeep Vanga:సూపర్‌స్టార్ రణబీర్ కపూర్ నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ వెనుక ఉన్న సృజనాత్మక శక్తి ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ఈ చిత్రం అఖండ విజయాన్ని ఆస్వాధిస్తున్నారు. కబీర్ సింగ్‌తో షాహిద్‌కి, యానిమల్తో రణబీర్ కి భారీ బ్లాక్ బస్టర్లను అందించిన ఘనత తెలుగు వాడి సొంతమైంది. షాహిద్ కి కెరీర్ తొలి 100 కోట్ల క్లబ్ సినిమాని ఇచ్చిన ఘనత సందీప్ వంగాకే చెందుతుంది. అర్జున్ రెడ్డి రీమేక్ గా రూపొందించిన కబీర్ సింగ్ ఎన్నో వివాదాల మధ్య దాదాపు 250 కోట్లు వసూలు చేసింది. అలాగే రణబీర్ కి తొలి 500 కోట్ల నెట్ క్లబ్ ని సందీప్ వంగా అందించాడు. యానిమల్ చిత్రం 900 కోట్ల గ్రాస్ క్లబ్ కి చేరువలో ఉందని తెలుస్తోంది.
యానిమల్ అఖండ విజయంపై సందీప్ వంగా ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇటీవల అనేక ఇంటర్వ్యూలలో నిమగ్నమయ్యాడు. తాజాగా ఓ మీడియా ఇంటరాక్షన్ లో అతడు OTT వెర్షన్ కోసం అదనపు ఫుటేజీని చేర్చడం గురించి ప్రస్తావించాడు. థియేట్రికల్ విడుదల నుండి 8-9 నిమిషాలు మాత్రమే ట్రిమ్ చేసామని వంగా స్పష్టం చేశాడు. OTT విడుదల కోసం ఈ కంటెంట్ ని తిరిగి జోడించేందుకు పునరుద్ధరించనున్నామని అభిమానులకు భరోసా ఇచ్చాడు. ప్రస్తుతం OTT వెర్షన్‌ని ఎడిట్ చేయడంలో బిజీగా ఉన్న సందీప్ వంగా వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచాలని నిశ్చయించుకున్నాడు.
అధికారిక ప్రకటన పెండింగ్‌లో ఉన్నా కానీ.. 26 జనవరి 2024న యానిమల్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ, అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. T-సిరీస్ – భద్రకాళి పిక్చర్స్ సంయుక్త సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కింది.