Telangana : పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో చాలా మంది నేతలు వారి పార్టీలను వీడి ఇతర పార్టీలలోకి మారుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లోని కీలక రాజకీయ నాయకులు కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు పోతున్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఘర్ వాపసీ పేరుతో నేతలను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాల్లోని కొందరు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల వరంగల్ మేయర్ గుండు సుధారాణితో పాటు ఇతర కీలక నేతలు కాంగ్రెస్ పార్టలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని అక్కడి పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి.
వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంటున్న పార్టీల ఫిరాయింపులతో విసిగి వేసారిన ప్రజలు అనేక చోట్ల ఆసక్తికర ఫ్లెక్సీలను ప్రదర్శించి రాజకీయ నేతలను తూర్పారపడుతున్నారు. తాజాగా పార్టీ మారిన నేతలను హెచ్చరిస్తూ కార్టూన్ లతో ఫ్లెక్సీలు రూపొందించి చెప్పుల దండలు వేసి కాలనీలలో ఏర్పాటు చేశారు. ప్రస్తతం ఈ ఫ్లెక్సీలపై వరంగల్ పట్టణంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.