IT Employees : ఐటీ ఉద్యోగుల జీతాలు లక్షల్లో ఉంటాయి. వారి జీతం లక్షల్లో ఉంటే వారికి వచ్చే వ్యాధులు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఐటీ ఉద్యోగులకు ఒత్తిడితో కూడిన పని విధానం, అనారోగ్య కర ఆహారపు అలవాట్లు, గంటల కొద్ది కూర్చుని పనిచేయడం ద్వారా పలు రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.
ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు హెచ్ సీఎల్ హెల్త్ కేర్ తెలిపింది. దేశ వ్యాప్తంగా 56 వేల మందికి మెడికల్ టెస్టులు చేయగా, 77శాతం మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. 22శాతం ఊబకాయం, 17శాతం ప్రిడయాబెటిస్, 11శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని వెల్లడైంది. జంక్ ఫుడ్స్, గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం, సరైన డైట్ పాటించకపోవడం, నిద్రలేమి, ఆల్కహాల్, సిగరెట్ల వల్ల సంతానలేమి సమస్య పెరుగుతోందని చెప్పింది.
ఐటీ ఉద్యోగులు సగటున 8గంటల కంటే ఎక్కువ సమయం కూర్చునే పనిచేస్తుంటారు. వ్యాయామం, శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. అలాగే రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం కూడా ఓ కారణమవుతోంది. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టాలంటే మంచి తిండితో పాటు వ్యాయామం కచ్చితంగా చేయాలి. పనిచేస్తున్నప్పుడు గంటకు ఓసారి లేచి నడవడంతో పాటు తేలికపాటి వ్యాయామం కూడా చేయాలి. అలాగే ఇంటి దగ్గర నడకతో పాటు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలి.