Salaar Vs Dunki:ప్రైమ్ స్క్రీన్ల కోసం `సలార్` నిర్మాతల వార్?
Salaar Vs Dunki:2023 క్రిస్మస్ రేసులో ప్రభాస్ నటించిన సలార్.. కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన డంకీ విడుదలకు రెడీ అవుతున్నాయి. కేవలం 10రోజుల్లోనే ఈ రెండు సినిమాల విజువల్ ట్రీట్ ని అభిమానులు ఆస్వాధించనున్నారు. అయితే రిలీజ్ ముంగిట ఈ రెండు సినిమాల కోసం ప్రైమ్ ఏరియాలో థియేటర్లు దక్కించుకోవాలని నిర్మాతలు పట్టుబడుతున్నారట. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో విదేశాల్లోను మంచి ఏరియాల్లో థియేటర్ల కోసం నిర్మాతల నడుమ పోటీ నెలకొంది. ముఖ్యంగా భారీ హైప్ ఉన్న యాక్షన్ చిత్రం సలార్ కోసం మరిన్ని థియేటర్లు అదనంగా కావాలని హోంబలే నిర్మాత విజయ్ కిరంగదూర్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
ఆసక్తికరంగా ఈసారి రేసులో సలార్, డంకీలతో పాటు హాలీవుడ్ చిత్రం ఆక్వామేన్ 2 పోటీపడుతోంది. దీంతో థియేటర్లు మూడు సినిమాల నడుమ పంచాల్సిన పరిస్థితి ఉంది. డంకీ రిలీజైన మరుసటి రోజు ప్రభాస్ సలార్ విడుదలవుతుంది. వీటితో పాటు ఆక్వామేన్ 2 కూడా భారతదేశంలో చెప్పుకోదగ్గ థియేటర్లలో విడుదలవుతోంది. దీంతో త్రిముఖ పోటీ నెలకొందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.
అయితే అదనపు స్క్రీన్ల కోసం సలార్ నిర్మాత ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? అంటే.. ఆయన అన్న మాట ఆసక్తిని కలిగించింది. థియేటర్ల కోసం అనవసరమైన కొట్లాట ఏదీ ఉండదు. ఎదుటివారిని చులకనగా మాట్లాడలేం.. అని కిరంగదూర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. సామరస్యంగా థియేటర్ల సమస్యను పరిష్కరించుకోగలమనే ధీమాను ఆయన వ్యక్తం చేసారు.ఎగ్జిబిటర్లు, పంపిణీ వర్గాలతో సమావేశమై థియేటర్ల పరమైన క్లాష్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటామని కూడా ఆయన తెలిపినట్టు సమాచారం.
సలార్ ఇద్దరు స్నేహితుల మధ్య వైరం నేపథ్యంలో ఆసక్తికర సినిమా. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా అలరించనుంది. అయితే డంకీ విదేశీ కలలతో ఎగిరిపోయే కొందరు యువకుల వెతల నేపథ్యంలో సినిమా. ఈ రెండిటిలోను భారీగా భావోద్వేగాలకు ఆస్కారం ఉంది. అయితే ప్రభాస్ సలార్ మాస్ కి స్పెషల్ ట్రీట్ గా నిలవనుంది. అదే సమయంలో రాజ్ కుమార్ హిరాణీ లాంటి ప్రతిభావంతుడు తెరకెక్కించిన సినిమా కాబట్టి డంకీలో ఫన్, చమత్కారం,
ఎమోషన్స్ కి కొదవేమీ ఉండదని భరోసా ఉంది. అందువల్ల ఈ రెండు సినిమాల టికెట్ల కోసం ఇప్పటి నుంచే భారీ డిమాండ్ నెలకొందని తెలిసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు ఇరు సినిమాల కర్తలు, నిర్మాతలు చాలా కాలంగా ఎగ్జిబిటర్లు, పంపిణీదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.