Aadujeevitham:ఒక ప్రముఖ దర్శకుడు తాను ప్రారంభించిన సినిమాని పూర్తి చేయడానికి ఏకంగా పదేళ్లు పట్టింది. దాదాపు పదేళ్ల క్రితం ముహూర్తం చేసి, షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. అయితే ఈ సినిమా ఇన్నేళ్ల పాటు ఆగిపోవడానికి కారణాలను వెల్లడించాడు సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్.
మలయాళంలో నం.1 డైరెక్టర్ గా పేరున్న బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం మొదలైన ఆడు జీవితం ఇప్పటికి పూర్తయి విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదల గురించి చిత్రబృందం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తోంది. ఈ సినిమా ప్రారంభించాక దీనికోసం విదేశాల నుంచి కొన్ని పశువులను రవాణా చేయాలని ప్రయత్నించారు. కానీ దానికి భారత ప్రభుత్వ అనుమతి లభించలేదు. దీంతో షూటింగ్ స్పాట్ ని జోర్డాన్ కి మార్చాల్సి వచ్చింది. అక్కడ షూటింగ్ ప్రారంభించిన ఆరు రోజులకే కరోనా రంగ ప్రవేశం చేసింది. దీంతో అందరూ సెట్ లో లాకయ్యారు.
ఇలాంటి రకరకాల కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి బ్లెస్సీకి బ్లెస్సింగ్ దక్కింది. సినిమా పూర్తయింది. ఎట్టకేలకు వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. అయితే సినిమా పూర్తి చేసిన చివరి రోజు బ్లెస్సీ తన వద్దకు వచ్చి కౌగిలించుకుని దాదాపు 10 నిమిషాల పాటు ఏడ్చేసాడట. సినిమా పూర్తవడానికి ఏకంగా పదేళ్లు పట్టిందని అర్థం చేసుకున్నాను అని సుకుమారన్ వెల్లడించారు. 2018లో పెండింగ్ షూటింగ్ ని ప్రారంభించగానే కరోనా రావడంతో మళ్లీ డిలే అయిపోయింది. దీనివల్ల బ్లెస్సీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెలిపారు.
ఏది ఏమైనా ఆడు జీవితం విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రీకరణ సమయంలో ఎదుర్కొన్న అన్ని ఇబ్బందులను మర్చిపోవాలంటే బ్లాక్ బస్టర్ కొట్టాల్సి ఉంటుంది. కష్టాలన్నీ సక్సెస్ తోనే మర్చిపోగలం. అలాంటి చిరస్మరణీయ విజయం బ్లెస్సీకి దక్కాలని ఆకాంక్షిద్దాం. సౌదీలో ఒక మేకల కాపరి బానిసత్వంపై సినిమా ఇది. నిర్భంధించి బలవంతంగా అతడిని అక్కడి నుంచి వెళ్లిపోనీకుండా నిలువరిస్తారు. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ సినిమా కథాంశం.