Salaar:అది ప్రభాస్ సినిమాలకు మాత్రమే సాధ్యం:నిర్మాత విజయ్ కిరగందూర్
Salaar:ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్:పార్ట్ 1- సీజ్ ఫైర్. అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. డిసెంబర్ 22న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. `కేజీఎఫ్` సిరీస్ సినిమాల తరువాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో `సలార్`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై భారీ సినిమాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న విజయ్ కిరగందూర్ ఈ మూవీని నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. మరో పది రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో టీమ్ ఇప్పటి వరకు ప్రమోషన్స్ ప్రారంభించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌ని నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రారంభించారు. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో `సలార్` గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా హీరో ప్రభాస్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించారు.
`సలార్` విడుదల తేదీ వెనుక జ్యోతిష్యానికి సంబంధించిన కారణం ఏమైనా ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ..అవునన్నారు. `మా నమ్మకాన్ని బట్టి విడుదల తేదీలను ప్రకటిస్తాం. గత 12 ఏళ్లుగా ఒకే పద్దతిలో సినిమాలురిలీజ్ చేస్తున్నాం. `సలార్` రిలీజ్ సమయంలోనే `డంకీ`, `ఆక్వామ్యాన్` లాంటి సినిమాలు ఉన్నా మేము మాత్రం విడుదల తేదీని మార్చుకోలేదు. సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకుంటే ఆ సమయంలో తెలుగు, తమిళంలో కొత్త సినిమాలు చాలా వరకు రిలీజ్ అవుతున్నాయి. అందుకే డిసెంబర్ 22న ఖరారు చేశాం.
వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని కారణంగా సెప్టెంబర్ 22న విడుదల చేయలేకపోయాం. ఇక ప్రభాస్ నటించిన సినిమాలు కొన్ని అనుకున్న స్థాయిలో అలరించలేకపోయాయి. ఒక నిర్మాతగా నేను అలాంటి వాటిని పట్టించుకోను. ఒక హీరో సక్సెస్ స్టోరీ ఆధారంగా సినిమాలు తీస్తా. `సలార్` బ్లాక్ బస్టర్ అవుతుందని మాకు పూర్తి నమ్మకముంది. ప్రభాస్ సినిమాలు తొలి రోజు కలెక్షన్‌లు రికార్డులు సృష్టిస్తాయి. ఆయన సినిమాలకు తప్ప ఆ స్థాయి ఓపెనింగ్స్ ఎవరి సినిమాలకు సాధ్యం కావు` అని తెలిపారు. ఇక `సలార్` రెండవ భాగం గురించి చెబుతూ త్వరలోనే మొదలుపెడతామన్నారు. `కేజీఎఫ్ 3` గురించి వివరిస్తూ ..ప్రస్తుతం ప్రశాంత్ నీల్, హీరో యష్ ఇద్దరూ బిజీగా ఉన్నారని, వాళ్ల ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాక `కేజీఎఫ్ 3`ని ప్రారంభిస్తామన్నారు.