Salaar Movie Review:`సలార్` మూవీ రివ్యూ
Salaar Movie Review:నటీనటులు:ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, టిను ఆనంద్, శ్రియారెడ్డి, రామచంద్రరాజు, బాబీ సింహా, మధు గురుస్వామి, జాన్ విజయ్, మైమ్ గోపీ, సిమ్రత్ కౌర్, సప్తగిరి, బ్రహ్మాజీ, పృథ్విరాజ్ తదితరులు నటించారు.
సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ
సంగీతం:రవి బాస్రూర్
ఎడిటింగ్:ఉజ్వల్ కులకర్ణి
నిర్మాత:విజయ్ కిరగందూర్
రచన, దర్శకత్వం:ప్రశాంత్ నీల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హైవోల్టేజ్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్`. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. `బాహుబలి`తో ఇండియన్ సినిమా రూపు రేఖల్ని మార్చిన ప్రభాస్, కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో ఇండియన్ స్క్రీన్‌పై హాలీవుడ్ స్థాయి సినిమాలకు ఆజ్యం పోసిన ప్రశాంత్ నీల్ తొలి సారి కలిసి చేసిన సినిమా కావడంతో `సలార్`పై ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమా ఎలా ఉంటుందో అనే చర్చ గత కొంత కాలంగా జరుగుతూనే ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిశారంటే ఖచ్చితంగా పవర్ ఫుల్ మూవీ రావడం పక్కా అంటూ అందరిలోనూ ఆసక్తి మొదలైంది. దానికి తగ్గట్టే టీజర్, ట్రైలర్‌లు ఉండటంతో సినిమా రిలీజ్ కోసం మరింత ఉత్కంఠ ఏర్పడింది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ తొలి సారి కలిసి నటించడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కొద్దీ సినిమా ఫీవర్ పతాక స్థాయికి చేరింది. ఫైనల్‌గా శుక్రవారం `సలార్` ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంతా ఆశించినట్టే సినిమా ఉందా? ..గత కొంత కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్‌కు `సలార్`తో హిట్ లభించిందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే..:
ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త రాజమన్నార్ (జగపతిబాబు). ఆ సామ్రాజ్యంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు. కర్త రాజమన్నార్ కుర్చీకోసం కుతంత్రాలు మొదలుతాయి. తాను ఉండగానే తన కొడుకు వరద రాజమన్నార్‌ను దొరగా చూడాలనేది తనరాజమన్నార్ కోరిక. అయితే కొన్నాళ్లు ఖాన్సర్ వదిలి తిరిగొచ్చేలోపు కథ మొత్తం మారిపోతుంది. కుర్చీ కుతంత్రాలు పతాక స్థాయికి చేరుకుని పరిస్థితి వరద రాజమన్నార్‌ను అంతం చేసే వరకు వెళుతుంది. అందుకోసం దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి వరద (పృథ్వీరాజ్ సుకుమారన్) తన చిన్న నాటి ప్రాణస్నేహితుడు దేవా (ప్రభాస్)ని పిలుస్తాడు. స్నేహితుడి కోసం దేవా ఒక్కడే నిలిచి క్రూరమైన సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అతనికి `సలార్` అనే పేరు ఎలా వచ్చింది? 25 ఏళ్ల పాటు ఊళ్లు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశా మారుమూల గ్రామాల్లో ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చింది? వీళ్ల జీవితంలోకి వచ్చిన ఆద్య (శృతిహాసన్) ఎవరు? ..ఫైనల్‌గా వరద కోసం దేవా ఏం చేశాడు? ..అతనికి వరదకు ఉన్న అనుబంధం, శత్రుత్వం ఏటీ అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
ప్రభాస్ కటౌట్‌ని అత్యంత శక్తివంతంగా వాడుకున్న దర్శకుల్లో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఆయన తరువాత ఆ స్థాయికి మించి వాడుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ అని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అంతగా ప్రభాస్‌ని స్క్రీన్‌పై ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేసిన తీరు రోమాంచిత అనుభూతిని కలిగిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇదొక విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తరువాత ప్రభాస్ తన అభిమానులు ఎలా ఉండాలని కోరుకున్నారో అదే స్థాయి పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ కనిపించారు. తల్లి చాటు కొడుకుగా, మాట జవదాటని స్నేహితుడిగా అమాయకంగా కనిపించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
పోరాట ఘట్టాల్లో ప్రభాస్ కనిపించిన తీరు, చూపించిన హీరోయిజం, స్టైల్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇందులో శృతిహాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. తను టీచర్‌గా పాత్ర పరిథిమేరకు కనిపించి ఆకట్టుకుంది. ఇక వరద పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ప్రభాస్‌కు ప్రాణ స్నేహితుడిగా కనిపించిన తీరు బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. జగపతిబాబు, ఈశ్వరీరావు, టిను ఆనంద్, శ్రియారెడ్డి, రామచంద్రరాజు, బాబీ సింహా, మధు గురుస్వామి, జాన్ విజయ్, మైమ్ గోపీ, సిమ్రత్ కౌర్, సప్తగిరి, బ్రహ్మాజీ, పృథ్విరాజ్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల తీరు:
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సగటు సినీ ప్రేక్షకుడికి `గేమ్ ఆఫ్ థ్రోన్స్` వంటి సిరీస్‌లని చూసిన ఫీల్‌ని కలిగిస్తుంది. అంతే కాకుండా ఖాన్సర్ ప్రపంచాన్ని హాలీవుడ్ సినిమాల తరహాలో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. రవి బాస్రూర్ బాణీలు, నేపథ్య సంగీతం, భువన్ గౌడ ఛాయాగ్రహణం `సలార్`కు ప్రధాన బలంగా నిలిచాయి. అన్బుఅరివు కంపోజ్ చేసిన పోరాట ఘట్టాలు రోమాంచితంగా ఉన్నాయి. ఓ మామూలు కథను కల్పిత ప్రపంచం చుట్టూ అల్లి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఎలా ఉందంటే:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ సిరీస్‌ల ఫేమ్ ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా అంటే అభిమానులు, ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవన్నీ సలార్‌లో ఉన్నాయి. కేజీఎఫ్‌లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వంటి ప్రపంచాన్ని ఆవిష్కరించి ప్రేక్షకులు అందులో లీనమయ్యేలా చేశాడు. అంతే కాకుండా పతాక స్థాయిలో హీరోయిజాన్ని చూపించి ఫ్యాన్స్ చేత శభాష్ అనిపించుకున్నాడు. `సలార్`కు కూడా ఇదే ఫార్ములాని ఉపయోగించి `ఖాన్సార్` అనే సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. అయితే `కేజీఎఫ్`కు మించి ఇందులో ఎలివేషన్‌ల కంటే డ్రామాకు ప్రధాన్యత నిచ్చాడు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే హీరో ఎలివేషన్స్ ఇచ్చి ప్రభాస్ అభిమానులని చాలా రోజుల తరువాత ఖుషీ చేశాడు.
అయితే ద్వితీయార్థంలో కొంత గందరగోళం కనిపించింది. కథనంలో స్పష్టత లోపించింది. అయితే సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే డ్రామా ఉండటంతో కొంత వరకు ఫరవాలేదు అనిపించింది. స్నేహం, అధికార కాంక్ష, ప్రతీకారంచుట్టూ సాగిన కథ ఇది. చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథని నడిపించిన తీరు బాగుంది. వెయ్యేళ్ల క్రితం జరిగిన కథతో ముడిపెడుతూ ఈ కథని చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది. ద్వితీయార్థంలో హీరోని పృథ్విరాజ్ సుకుమారన్ నియంత్రించడం, ఆ తరువాత ఒక్కసారిగా ప్రభహాస్ చేతికి కత్తి రావడంతో హీరోయిజం పతాక స్థాయికి చేరింది. కాటమ్మ తల్లికి బలి ఇచ్చే సందర్భంగా వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకే హైలైట్. కుర్చీ చుట్టూ అల్లుకున్న కుతంత్రపు డ్రామా కావడం, పాత్రల వరసలు గందరగోళానికి గురి చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంతా బాగానే ఉన్నా ద్వితీయార్థంలో వచ్చే గందరగోళం వల్ల సినిమాకు అది కొంత మైనస్‌గా మారింది. ఆ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఒక్క మాటలో చెప్పనాలంటే ఇది ఫ్యాన్స్ సినిమా. రెబల్ స్టార్ యాక్షన్ హంగామా అని చెప్పొచ్చు.
పంచ్ లైన్: రెబల్ స్టార్ యాక్షన్ హంగామా
రేటింగ్:2.75