Salaar:`సలార్`కి లైన్ క్లియర్ చేసిన డంకీ-ఆక్వామేన్
Salaar:ఈ క్రిస్మస్ కానుకగా మూడు భారీ చిత్రాలు భారతదేశంలో పోటీపడుతున్నాయి. డంకీ-ఆక్వామేన్ 2-సలార్ నువ్వా నేనా? అంటూ పోటీకి దిగాయి. అయితే ఇప్పటికే రెండు సినిమాల ఫలితం ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన డంకీ మిశ్రమ స్పందనలను అందుకుంది. పైగా ఇది క్లాస్ ఆడియెన్ కి చేరువయ్యే సినిమా. అలాగే హాలీవుడ్ భారీ చిత్రం ఆక్వామేన్ 2 కూడా రిలీజైంది. దీనికి పూర్తిగా నెగెటివ రివ్యూలు వచ్చాయి. భారీ విజువల్ గ్రాఫిక్స్ తో రూపొందిన ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే తేడా కొట్టిందని, విసుగు పుట్టిస్తోందని సమీక్షకులు రాసారు.
అంటే ఒక యావరేజ్ సినిమా.. ఒక ఫ్లాప్ సినిమాతో పోటీపడుతూ ఇప్పుడు సలార్ బరిలో దిగుతోంది. ఈ శుక్రవారం (డిసెంబర్ 22) నుంచి సలార్ హవా థియేటర్లలో కొనసాగనుంది. డంకీ కోసం ఉత్తరాదిన ప్రముఖ థియేట్రికల్ చైన్ భారీ స్క్రీన్లను కేటాయించినా కానీ, సలార్ ప్రీబుకింగుల ముందు ఈ పప్పులేవీ ఉడకలేదు. ఇప్పుడు అన్ని మల్టీప్లెక్సుల్లో సలార్ కి లైన్ క్లియరైంది. దీంతో ఈరోజు విడుదలవుతున్న సలార్ భారీ ఓపెనింగులు సాధిస్తుందని భావిస్తున్నారు. సలార్ బ్లాక్ బస్టర్ అన్న టాక్ వస్తే చాలు, ఇక ప్రభాస్ హవాకు ఎదురే ఉండదని అంచనా వేస్తున్నారు. కేజీఎఫ్ దర్శకుడితో ప్రభాస్ భారీ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సత్ఫలితం ఇవ్వనుంది అన్నది మరికాసేపట్లో రివ్యూల రూపంలో బయటపడుతుంది.
ఇక డంకీలో షారూఖ్ – తాప్సీ నటనకు ప్రశంసలు కురవగా, ఇందులో కంటెంట్ యావరేజ్ మాత్రమేనని సమీక్షకులు రాసారు. అలాగే ఆక్వామేన్ 2లో జాసన్ మావో సముద్ర పుత్రుడిగా ఎంత అద్భుతంగా నటించినా కానీ, ఈ సినిమాలో మ్యాటర్ లేదని తేల్చేసారు. అందుకే ఇప్పుడు సలార్ లాంటి భారీ యాక్షన్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే చాలు, థియేటర్లలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు.
కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ మరొక క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్‌తో తిరిగి వచ్చాడని… సలార్ పార్ట్ 1 లైవ్ సమీక్షకులు చెబుతున్నారు. ప్రభాస్- పృథ్వీరాజ్ సుకుమారన్ నువ్వా నేనా? అంటూ పోటీపడి నటించిన ఈ చిత్రం కథాంశం ఆసక్తికరం. నేరపూరిత కాల్పనిక నగరమైన ఖాన్సార్ లో వరదరాజా మన్నార్ ఒక యుద్ధంలోకి దిగుతాడు. నగరానికి మన్నార్ ఒక ప్రభువు కావాలనుకుంటాడు. అయితే అతడికి శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. ఇంతలోనే శత్రువులను ఎదుర్కోవడంలో తన స్నేహితుడికి సాయంగా ప్రభాస్ బరిలో దిగుతాడు. మన్నార్ నగర పాలకుడు కావడానికి సహాయపడతాడు. టిను ఆనంద్, శ్రుతి హాసన్, జగపతి బాబు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇది తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, హిందీలో విడుదలవుతోంది.