Salaar First Single:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్`. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా మరో తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. `కేజీఎఫ్` సిరీస్ సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. స్నేహితుడి కోసం ఎంత వరకైనా వెళ్లే ఓ పవర్ ఫుల్ వ్యక్తి నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమాని రూపొందించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై భారీ చిత్రాల నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు.
ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్ని ఈ మూవీ డిసెంబర్ 22న రికార్డు స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సంచలనం సృష్టిస్తున్న `సలార్` ఫస్ట్ డే ఫస్ట్ షోతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ అంచనాల్ని పెంచేయడంతో ప్రభాస్ అభిమానులు సినిమా రిలీజ్ కోసం మేకర్స్ ఇప్పటికి ప్రమోషన్స్ ప్రారంభించలేదని కంగారు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో అందరిని సర్‌ప్రైజ్ చేస్తూ హోంబలే ఫిలింస్ వారు `సలార్` ఫస్ట్ సింగిల్‌గా `సూరీడే..గొడుగు పట్టి వచ్చాడే..` అంటూ సాగే లిరికల్ వీడియోని బుధవారం విడుదల చేశారు. ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణ స్నేహితులుగా నటించారు. వీరిద్దరి నేపథ్యంలో సాగే ఈ పాటకు `కేజీఎఫ్` ఫేమ్ రవి బాస్రూర్ సంగీతం అందించారు.
సూరీడే గొడుగు పట్టి…
వచ్చాడే భుజము తట్టి…
చిమ్మ చీకటిలోను నీడలా ఉండేటోడు..
రెప్పనొదలక కాపుకాసెడి కన్ను వాడడు...
అంటూ సాగే ఈ పాటని హరిణి ఇవటూరి ఆలపించగా…కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు. ట్రైలర్‌లోనే కథ చెప్పేసిన ప్రశాంత్ నీల్ ఈ పాటతో ఇద్దరు స్నేహితుల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుంది? తన స్నేహితుడు వరదరాజమన్నార్ కోసం దేవా ఎంత వరకు వెళ్లాడు? ..ఎంత మందిని ఎదిరించాడు?. తన స్నేహితుడికిచ్చిన మాట కోసం ఒక్కడే సైన్యమై ఎలాంటి సమరం సాగించాడు?..ఇంతకీ `సలార్` ఎవరు? అతని కథేంటీ? సలార్‌కు దేవాకున్న సంబంధం ఏంటీ అనే ఆసక్తికర అంశాలని చూపించి షాక్ ఇచ్చారు. కథ ముందే చెప్పేసి చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్న ప్రశాంత్ నీల్ `సలార్`తో వరల్డ్ వైడ్‌గా భారీ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకోవడం ఖాయం అని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ నమ్మకానికి కారణం ఏంటన్నది తెలియాలంటే డిసెంబర్ 22 వరకు వేచి చూడాల్సిందే.