JAISW News Telugu

Salaar:హైద‌రాబాద్‌లో `స‌లార్` ఒంటిగంట షోలు..ఎక్క‌డెక్క‌డో తెలుసా?

Salaar:తెలంగాణ కొత్త ముఖ్య‌మంత్రి రేవంత్ డైల‌మాను క్లియ‌ర్ చేసారు. స‌లార్ అభిమానుల‌ సందేహాలు ఇప్ప‌టికి క్లియ‌ర్ అయ్యాయి. టిక్కెట్ ధర పెంపు, స్పెషల్ షో అనుమతులను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం మంజూరు చేయ‌గా ప్ర‌భాస్ అభిమానుల్లో ఉత్సాహం నెల‌కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స‌లార్ భారీ ఓపెనింగుల‌కు మ‌రింత వెసులుబాటు పెరిగిందని భావిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ డిసెంబ‌ర్ 22 నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో అందుబాటులోకి వ‌స్తోంది.

ఇంత‌లోనే తెలంగాణ‌లో టికెట్ ధ‌ర‌ల పెంపుపై క్లారిటీ రానే వ‌చ్చింది. సింగిల్ స్క్రీన్‌లకు రూ.65, మల్టీప్లెక్స్‌లకు రూ.100 చొప్పున టిక్కెట్ ధరలను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో తెలంగాణ సింగిల్ స్క్రీన్‌లలో గరిష్ట టిక్కెట్ ధర రూ.253 .. మల్టీప్లెక్స్‌ల్లో రూ.413 వరకు ఉంటుంద‌ని అంచ‌నా. ఆన్‌లైన్ బుకింగ్‌కు అదనపు సర్వీస్ ఛార్జీ రూ.30 వ‌ర‌కూ ఉండ‌నుంది.

ప్ర‌తిసారీ ప్ర‌భాస్ కి హైద‌రాబాద్ నుంచి భారీ వ‌సూళ్లు ద‌క్కుతాయ‌న్న‌ది తెలిసిందే. ఇప్పుడు స‌లార్ కి కూడా మెట్రో న‌గ‌రం నుంచి భారీ క‌లెక్ష‌న్స్ సాధ్య‌మ‌వుతాయ‌ని అంచ‌నా. హైదరాబాద్‌లోని 12 థియేటర్లు సహా తెలంగాణలోని మొత్తం 20 థియేటర్లలో డిసెంబర్ 22వ తేదీన స‌లార్ 1 ఏఎం షోలను ప్రదర్శించనున్నారు. ఆ మేర‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు మంజూరు చేయ‌డంతో అభిమానుల్లో ఉత్సాహం నెల‌కొంది. డిసెంబర్ 22న స‌లార్ 4 ఏఎం బెనిఫిట్ షోను ప్రదర్శించడానికి చాలా ఇతర థియేటర్లకు అనుమ‌తులు ద‌క్కాయి.

ఒంటిగంట‌కు బెనిఫిట్ షో వేసే థియేట‌ర్ల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే..AMB సినిమాస్, గచ్చిబౌలి- నెక్సస్ మాల్, కూకట్‌పల్లి- బ్రహ్మరాంబ, కూకట్‌పల్లి- మల్లికార్జున, కూకట్‌పల్లి- అర్జున్ థియేటర్- విశ్వనాథ్, కూకట్‌పల్లి- సంధ్య 70MM, RTC X రోడ్స్- సంధ్య 35MM, RTC X రోడ్స్ – రాజధాని డీలక్స్, దిల్ సుఖ్ నగర్- శ్రీరాములు, మూసాపేట- గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ – శ్రీ సాయిరాం, మల్కాజిగిరి థియేట‌ర్ల‌లో స‌లార్ 1ఏఎం షోలు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌లార్ లో శ్రుతిహాస‌న్, పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే.

Exit mobile version