Saindhav Movie Review : ‘సైంధవ్’ మూవీ రివ్యూ..యాక్షన్ మూవీ లవర్స్ కి పండగ లాంటి సినిమా!
Saindhav Movie Review : నటీనటులు : విక్టరీ వెంకటేష్, శ్రద్ద శ్రీనాథ్, ఆర్య,ఆండ్రియా జారేమియా, నవాజుద్దీన్ సిద్దిఖీ, రుహాని శర్మ, సరా పాలెక్కర్ తదితరులు.
రచన – దర్శకత్వం : శైలేష్ కొలను
సంగీతం : సంతోష్ నారాయణ్
నిర్మాత : వెంకట్ బోయినపల్లి
విక్టరీ వెంకటేష్ సోలో హీరో గా చేసిన సినిమా థియేటర్స్ లో విడుదలై చాలా కాలమే అయ్యింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం తర్వాత ఆయన మల్టీస్టార్రర్ చిత్రాలే చేస్తూ వచ్చాడు. మధ్యలో ‘దృశ్యం 2’ మరియు ‘నారప్ప’ వంటి సినిమాలు చేసినా, అవి డైరెక్ట్ ఓటీటీ లో విడుదలయ్యాయి. అభిమానులు ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో నుండి సోలో మూవీ థియేటర్స్ లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయం లో ‘సైంధవ్’ ప్రాజెక్ట్ ని ప్రకటించారు మేకర్స్. శైలేష్ కొలను దర్శకత్వం లో వెంకటేష్ 75 వ చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమా పై మొదటి నుండి అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాము.
కథ :
సైంధవ్ కోనేరు అనే వ్యక్తి తన కూతురుతో కలిసి చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కానీ ఒక రోజు స్కూల్ కి తీసుకొని వెళ్లి తిరిగి వస్తుండగా ఆయన కూతురు స్పృహ కోల్పోయి క్రింద పడిపోతుంది. డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి చూపించగా ఆమెకి న్యూరో మస్క్యూలర్ వ్యాధి సోకినట్టుగా చెప్తుంది. ఈ వ్యాధి నివారణకు ఒక్క ఇంజక్షన్ అవసరం అవుతుందని, ఆ ఇంజక్షన్ విలువ 17 కోట్ల రూపాయిలు ఉంటుందని డాక్టర్లు చెప్తారు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన సైంధవ్ కి అంత డబ్బులతో ఇంజక్షన్ ఎలా తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్న సమయం లో విలన్ నా దగ్గర నీ కూతురుకి కావాల్సిన ఇంజక్షన్ ఉంది, కానీ అది ఇవ్వాలంటే నువ్వు దాచిపెట్టిన నా కంటైనర్లు మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలి అని కండిషన్ పెడుతాడు. ఇంతకీ విలన్ కి సైంధవ్ కి ఉన్న లింక్ ఏంటి?, ఫ్లాష్ బ్యాక్ లో అసలు ఏమి జరిగింది?, సైంధవ్ ఆ కంటైనెర్స్ ని ఎందుకు దాచిపెట్టాడు?, చివరికి తన కూతురుని కాపాడుకున్నాడు లేదా? అనేదే స్టోరీ.
విశ్లేషణ :
సినిమా ప్రారంభం 30 నిమిషాలు స్లో స్క్రీన్ ప్లే తోనే సాగుతుంది. డైరెక్టర్ ఎక్కువగా క్యారెక్టర్స్ ని బిల్డప్ చెయ్యడానికే సమయం తీసుకున్నాడు. సినిమాలో 30 నిమిషాలు గడిచిన తర్వాత అసలు స్టోరీ మొదలు అవుతుంది. కథ డిమాండ్ ని బట్టి స్లో స్క్రీన్ ప్లే తో సినిమాని నడిపించాలి కాబట్టి, న్యారేషన్ స్లో గానే ఉంటుంది, కానీ గ్రిప్పింగ్ గా , ఆడియన్స్ ఆసక్తిగా సినిమాని చూసేలా తీర్చి దిద్దాడు డైరెక్టర్ శైలేష్ కొలను. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం రెండు మూడు అదిరిపోయే రేంజ్ యాక్షన్ బ్లాక్స్ తో ఆసక్తికరమైన ట్విస్టుతో ఇంటర్వెల్ కార్డు వేస్తాడు డైరెక్టర్. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించాడు. అదే పేస్ ని చివరి వరకు కొనసాగించాడు కానీ, ఎక్కడో ఎదో ‘వావ్’ ఫ్యాక్టర్ మిస్ అయ్యినట్టుగా అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు ప్రముఖ హాలీవుడ్ చిత్రం ‘జాన్ విక్’ నుండి కాపీ చేసినట్టుగా అనిపించింది. ఓవరాల్ గా సినిమా పర్వాలేదు బాగుంది అనే రేంజ్ లో తీసాడు డైరెక్టర్.
ఇక నటీనటుల విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి అనే సంగతి మన అందరికీ తెలుసు. ఈ చిత్రం లో ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డిక్షన్ కూడా అదిరిపోయింది.ఇక హీరోయిన్ శ్రద్ద శ్రీనాథ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఈ సినిమాకి వెంకటేష్ తర్వాత పెర్ఫార్మన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఈ సినిమా లో ఆయన పండించిన విలనిజం బాగా వర్కౌట్ అయ్యింది. చాలా సన్నివేశాల్లో ఆయన నటన సినిమాని మరోలెవెల్ కి తీసుకెళ్లింది. ఇక కోలీవుడ్ హాట్ బ్యూటీ ఆండ్రియా కూడా నెగటివ్ రోల్ లో అదరగొట్టేసింది. మిగిలిన పాత్రధారులు కూడా వారికి ఉన్న పరిధిమేర చక్కగా నటించారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది.
చివరి మాట :
ఈ సంక్రాంతికి వచ్చిన మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. వెంకటేష్ ని మాస్ యాక్షన్ సన్నివేశాల్లో చూడడానికి ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా కనుల పండుగే.
రేటింగ్ : 3/5