Sachin Tendulkar : ‘రంజీ’లపై సచిన్‌ పోస్ట్‌ వైరల్‌..

Sachin Tendulkar

Sachin Tendulkar

Sachin Tendulkar : టీమిండియా జట్టకు దూరమైన ప్లేయర్స్ దేశవాళీ టోర్నీలో ఆడకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన శ్రేయస్ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ ను సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి తప్పించింది. ఈ పరిణామాలపై దిగ్గజ ప్లేయర్ సచిన్‌ తెండూల్కర్‌ స్పందించారు. దేశవాళి టోర్నీలకు సమ ప్రాధాన్యం ఇస్తూ బోర్డు చర్యలను అభినందించారు.

రంజీ ట్రోఫీలో ముంబై జట్టు ఫైనల్‌కు చేరింది. దీనిపై సచిన్‌ సోషల్‌ మీడియాలో బీసీసీఐ నిర్ణయంపై ప్రస్తావించారు. ‘నా కెరీర్‌లో అవకాశం దొరికినప్పుడల్లా ముంబై తరఫున ఆడేందుకు ఇష్టపడేవాడిని. మా డ్రెస్సింగ్‌ రూంలో 7 నుంచి 8 మంది ఇండియా జట్టు ఆటగాళ్లు ఉండేవారు. వాళ్లతో కలిసి ఆడడం సరదాగా అనిపించేది. జాతీయ ఆటగాళ్లు దేశవాళి జట్లతో కలిసి ఆడినప్పుడే.. వారి ఆటలో నైపుణ్యం మరింత పెరుగుతుంది. కొన్ని సార్లు కొత్త ప్రతిభ బయట పడుతుంది. బేసిక్స్‌ కొత్తగా నేర్చకునేందుకు అవకాశం కల్పిస్తుంది’ అని సచిన్‌ రాసుకొచ్చారు.

‘టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే స్టార్‌ ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలో ఆడితే వారికి ప్రాక్టీస్ తో పాటు మరింత ఆదరణ దక్కుతుంది. అభిమానుల నుంచి కూడా వారికి మద్దతు అందుతుంది. దేశవాళీ టోర్నీలకు బీసీసీఐ సమ ప్రాధాన్యత ఇవ్వడం అద్భుతంగా ఉంది’ అని సచిన్‌ అన్నారు.

ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు లేని సమయంలో దేశవాళి క్రికెట్ లో అత్యున్నత టోర్నీ రంజీలో ఆడాలన్నది బీసీసీఐ నిబంధన. కానీ, ప్రస్తుత తరం క్రికెటర్లు ఈ నిబంధనను కాల రాస్తున్నారు. ఇటీవల ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ నిర్లక్ష్యం వహించారు. దీంతో బీసీసీఐ వారిపై వేటు వేసింది.

TAGS