JAISW News Telugu

Sharmila : కృష్ణా ప్రాజెక్టుల జగడం.. షర్మిల ఎటువైపు?

Sharmila

Sharmila

Sharmila : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య ‘వాటర్ వార్’ నడుస్తోంది. జగన్ ప్రభుత్వానికి మేలు చేసేలా కేసీఆర్ గతంలో నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలేం జరిగిందో వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చింది. కృష్ణా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి  అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం సైతం చేసింది. నాడు ఈ నీటి వివాదాలపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ గా స్పందించిన షర్మిల ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ గా ఏ స్టాండ్ తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించిన అంశం పెద్ద వివాదంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ప్రాజెక్టు కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని తప్పబడుతూ మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమానికి సిద్ధమయ్యారు. రేపు(మంగళవారం) నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభను నిర్ణయించారు. దీంతో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నాడు కేసీఆర్ జగన్ ప్రభుత్వానికి మేలు చేసేందుకు తెలంగాణకు నష్టం చేసేలా నిర్ణయాలు తీసుకుందని ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చింది. ఇవాళ కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించేది లేదని తీర్మానం సైతం చేసింది.

ఇక వైఎస్ఆర్ టీపీ అధినాయకురాలిగా షర్మిల గతంలో తెలంగాణ ప్రయోజనాల కోసం తాను పోరాటం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనల మేరకు ఏపీకి మేలు జరిగేలా జగన్ వ్యవహరించారని.. అందుకు కేసీఆర్ సహకరించారని విమర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న వాదనతో ఏకీభవిస్తారా.. ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా స్పందిస్తారా అనేది కీలకంగా మారుతోంది. అటు సొంత పార్టీ ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రయోజనాలు.. ఈ అంశంలో షర్మిల ఏరకంగా రియాక్ట్ అవుతారనేది సోషల్ మీడియాలో చర్చ బాగానే జరుగుతోంది.

Exit mobile version