Rudra Raju : రాజకీయాల్లో త్యాగాలు పనికిరావు అని కొందరు అంటుంటారు. అయితే ఒక్కోసారి త్యాగాలు కూడా మంచే చేస్తాయి. అది పార్టీకో, వ్యక్తిగతంగానో ఉపయోగపడుతుంటాయి. రాజకీయాల్లో మనం చేసే ప్రతీ యాక్టివిటీకి ఎప్పుడో ఏదో రూపంలో మనకు ప్రతిఫలంగా లభిస్తుంది. తాజాగా వైఎస్ షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం తన సీటును త్యాగం చేశానని ఆమె అభివర్ణించుకున్నారు. పాలేరులో పోటీ చేయకుండా పొంగులేటికి మద్దతు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ అభిమానులు, వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత జరిగిన విషయాలు మనకు తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, షర్మిల కాంగ్రెస్ చేరిపోవడం ఇటీవల సంఘటనలే.
సంక్రాంతి పండుగ తమకు పదవులు, ఉద్యోగాలు, కానుకలు తేవాలని అంతా కోరుకోవడం సహజం. కానీ కాంగ్రెస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాత్రం ఆయనే కానుక ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు పండుగ తర్వాత ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడానికి ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
ఈనేపథ్యంలో షర్మిలకు లైన్ క్లియర్ కావడానికి ప్రస్తుత పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తన పీసీసీ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. దీంతో షర్మిల అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్టైంది. తెలంగాణలో కాంగ్రెస్ కోసం తాను చేసిన త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుని ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పజెప్పుతోంది. మరి రుద్రరాజు చేస్తున్న త్యాగాన్ని షర్మిల గుర్తుపెట్టుకుంటారా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ‘బంధం’ కన్నా బాధ్యతకే కట్టుబడి అన్న ప్రభుత్వంపై పోరాడి పార్టీని అధికారంలోకి తెస్తారా? అనేది మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.