Minister Ramprasad Reddy : మంత్రి రాంప్రసాద్ రెడ్డి చొరవతో జగ్గయ్యపేట ఆర్టీసీ డిపోలో అద్దెబస్సుల యజమానులు ఆందోళన విరమించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్ డిపోలో అద్దె బస్సుల యజమానులు బుధవారం ఆందోళనకు దిగారు. సమాచారం లేకుండా టైమింగ్స్ మార్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉండే సమయాలు ఇవ్వాలని యజమానులు డిమాండ్ చేశారు. సంక్రాంతి బకాయిలు చెల్లించలేదని, సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు.
33 అద్దె బస్సులను నిలిపి వేయడంతో విజయవాడ-జగ్గయ్యపేట మధ్య పలు సర్వీసులు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట వెళ్లేందుకు సరిపడా బస్సుల్లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించారు. యజమానులతో చర్చలు జరిపి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) అద్దె బస్సుల యజమానులతో మాట్లాడారు. ప్రభుత్వ హామీతో వారు ఆందోళన విరమించారు.