Conductor and driver : రోడ్డుపై పక్కకు తప్పుకోమన్నందుకు.. ఆర్టీసీ మహిళా కండక్టర్, డ్రైవర్ పై దాడి
conductor and driver : మద్యం మత్తులో రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తిని పక్కకు తిప్పుకోమన్నందుకు ఆర్టీసీ మహిళా కండక్టర్, డ్రైవర్ పై దాడి చేశాడు. ఈ సంఘటన జరుగుమల్లి మండలం కామేపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఒంగోలు నుంచి జరుగుమల్లి మండలం వర్థినేనిపాలేనికి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. టంగుటూరు, జరుగుమల్లి మార్గంలో కామేపల్లి విగ్రహాల కూడలికి చేరుకోగా ప్రయాణికులు దిగుతున్నారు. ఈ క్రమంలో అక్కడికి కామేపల్లి చెందిన పత్తిపాటి హరిబాబు మద్యం మత్తులో వచ్చి పలువురితో గొడవపడుతున్నాడు. ప్రయాణికులు బస్సు దిగిన తర్వా కండక్టర్ సుభాషిణి డ్రైవర్ కు రైటు చెప్పింది.
ఈ క్రమంలో హరిబాబు బస్సు చక్రం సమీపానికి వచ్చి నిల్చనున్నాడు. పక్కకు వెళ్లాలని కండక్టర్ చెప్పడంతో ఆమెను బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. అనంతరం బస్సు టైర్ల కింద పడుకొని నానా యాగీ చేశాడు. కండక్టర్ ను బస్సు చుట్టూ తిప్పుతూ చేతులతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ దుర్భాషలాడాడు. స్థానికులు అడ్డు చెప్పినా వినకుండా దాదాపు గంట సేపు నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. బస్సు డ్రైవర్ రెడ్డమ్మ దిగి వచ్చి అడ్డుకోబోవడంతో ఆయనపై తిరగబడి కొట్టాడు. కండక్టర్ సెల్ ఫోన్ తీసుకొని నేలకు కొట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి హరిబాబును అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. గాయపడిన కండక్టర్ సుభాషిణిని 108లో నెల్లూరు జిల్లా కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నట్లు సింగరాయకొండ సీఐ హజరత్తయ్య తెలిపారు.