RS Praveen Kumar : బీఎస్పీకి రాజీనామా.. సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar

RS Praveen Kumar

RS Praveen Kumar : బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. సోషల్‌ మీడియా వేదికగా శనివారం (మార్చి 16) ప్రకటించారు. తమ రాజకీయ భవిష్యత్, తమ అనుచరుల కోసం కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకు పార్టీని వీడడమే తన ముందుకు ఉన్న ప్రథమ కర్తవ్యంగా తోచిందని, దీనికి మరో అవకాశం తన ముందు లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

పొత్తు (బీఆర్ఎస్-బీఎస్పీ) ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందేనని.. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం అని ప్రవీణ్ కుమార్ అన్నారు. మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ దాన్ని భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిందని అందులో భాగమే కవిత అరెస్ట్ అని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీజేపీ కొనసాగిస్తున్న ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలను వదులుకోనని చెప్పారు.

నా రాజకీయ ప్రయాణం, ప్రస్థానం ఆపలేనని ఆయన స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకు బహుజన వాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటానని ప్రవీణ్‌ కుమార్‌ తన సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు. తాను బీఎస్పీని వీడుతున్న సందర్భంగా తెలంగాణలో ఆ పార్టీ భవిష్యత్, కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆ పార్టీ పెద్దలకు ఉందన్నారు.

కేసీఆర్‌తో భేటీ: బీఎస్పీలో ఉండగానే తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు డిక్లేర్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ తన రాజీనామా అనంతరం కేసీఆర్ ను కలిశారు. పొత్తు విషయంలో బీఎస్పీ అధినేత మాయావతి బీఎస్పీ బీఆర్ఎస్ తో కలిసేది లేదని తెలంగాణలో పొత్తుకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీని వీడినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీని వీడిన వెంటనే ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఇప్పటికే ఆయనకు నాగర్ కర్నూల్ టికెట్ ఇస్తానని కేసీఆర్ చెప్పారు. ఆమేరకు ఆ టికెట్ విషయంలో చర్చించినట్లు తెలుస్తోంది.

TAGS