PM Modi Photo : మధ్యప్రదేశ్ లోని ఇందౌర్ లోక్ సభ ఎన్నికల విజేత మెజార్టీని అంచనా వేసిన వారికి ప్రధాని ఫొటోతో కూడిన రూ.2 వేల వెండి నోటును బహుమతిగా అందించనున్నట్లు బంగారు వ్యాపారి నిర్మల్ వర్మ ప్రకటించారు. 51 మంది విజేతలకు ఈ బహుమతి అందించనున్నట్లు తెలిపారు. నోటుపై జాతిపిత మహాత్మాగాంధీతో పాటు పీఎం నరేంద్ర మోదీ ఫొటో ఉందని, మోదీపై అభిమానంతో ఓటింగును పెంచేందుకు ఇలా చేస్తున్నట్లు తెలిపారు. ఇందౌర్ లో కాంగ్రెస్ పోటీలో లేనందున బీజేపీ, ఇతర అభ్యర్థులకు మధ్య పోటీ ఉంది.
జూన్ 4న బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ లక్కీ డ్రా తీసి 51 మంది విజేతలను ప్రకటించి, బహుమతులు అందిస్తారని నిర్మల్ వర్మ తెలిపారు. ఈ పోటీకి ఇప్పటికే వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు వరకు అంటే జూన్ 3 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
ఇందౌర్ కు చెందిన నిర్మల్ వర్మ ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. ఇందౌర్ లో లోక్ సభ ఎన్నికల్లో విజేత సాధించే మెజార్టీ చెప్పిన 51 మందికి జాతిపిత మహాత్మాగాంధీతో పాటు పీఎం మోదీ ఫొటోతో ఉన్న వెండి నోటును అందించనున్నారు. ప్రధాని మోదీ వెండి విగ్రహాలే కాకుండా ఆయనకు సంబంధించిన పలు రకాల చిహ్నాలను నిర్మల్ వర్మ తయారు చేశారు.