Bonalu Festival : ఆషాఢ బోనాలకు రూ.20 కోట్లు మంజూరు
Bonalu Festival : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జులై 7వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ఆషాఢ బోనాలకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది.
జంట నగరాల్లో జులై 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ బోనాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆషాఢ బోనాలకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. జంట నగరాల్లో ఆషాఢ బోనాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
బేగంపేటలోని హరిత ప్లాజాలో నిర్వహించిన ఈ సమావేశంలో హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల ఉత్సవాలను నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.