Army Jawan Offer : రూ. 2.5 కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా – రాజకీయ నేతకు ఆర్మీ జవాన్ ఆఫర్
Army Jawan Offer : డబ్బులిస్తే ఈవీఎం మారుస్తానని రాజకీయ నేతకు ఓ ఆర్మీ జవాన్ ఆఫర్ ఇచ్చి చివరకు జైలుపాలయ్యాడు. మారుతి ధక్నే అనే వ్యక్తి ఆర్మీ జవాన్. ఇటీవల అతడు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత, శివసేన నాయకుడు అంబాదాస్ ధన్వేను పుణేలో కలిశాడు. నిర్దిష్ట అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చేలా చిప్ ను ఉపయోగించి ఈవీఎంను మారుస్తానని అందుకు తనకు రూ.2.5 కోట్లు ఇవ్వాలని తెలిపాడు.
దీంతో దన్వే అతడి గురించి పోలీసులకు సమాచారం అందించాడు. నిందితుడిని ఆధారాలతో సహా పట్టించేందుకు ప్రణాళికను అమలు చేశాడు. మంగళవారం సాయంత్రం దన్వే సోదరుడు రాజేంద్ర నిందితుడిని ఓ హోటల్ కు పిలిచాడు. అక్కడ రూ.1.5 కోట్లకు డీల్ పూర్తి చేసుకున్నట్లు అతడిని నమ్మించి అడ్వాన్స్ గా రూ. లక్ష ఇచ్చాడు. దన్వే ఇచ్చిన సమాచారంలో అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడు ఆర్మీ జవాన్ ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి భారీ మొత్తంలో అప్పులు ఉండడంతో వాటిని తీర్చేందుకు ఇలా అడ్డదారిలో మోసాలకు పాల్పడేందుకు యత్నిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన మారుతి ధక్నే జమ్మూకశ్మీర్ లోని ఉదంపూర్ ప్రాంతంలో ఆర్మీ బేస్ లో పని చేస్తున్నట్లు వెల్లడించారు.