Riots : యూపీలోని బహ్ రాయిచ్ లో అల్లర్లు.. ప్రధాన నిందితుడి అరెస్టు
Riots in UP : ఉత్తరప్రదేశ్ లోని బహ్ రాయిచ్ లో దుర్గాదేవి విగ్రహం నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవలు నిన్న (సోమవారం) మరింత భగ్గుమన్నాయి. ఆదివారం 22 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో ఆగ్రహించిన పలువురు కర్రలు, ఇనుప రాడ్లతో వీధుల వెంట తిరుగుతూ పలు దుకాణాలకు నిప్పుపెట్టారు. మన్సూర్ గ్రామం మహరాజ్ గంజ్ లో ఆదివారం దుర్గామాత విగ్రహ ఊరేగింపు సాగుతుండగా ఆ సమూహంపై మరో వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు.
దీంతో సుమారు అరడజను మంది గాయపడ్డారు. తూటా గాయంతో గోపాల్ మిశ్రా అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన ప్రజలు ఆందోళనకు దిగి నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.