RGV : శిష్యుడు ఛీత్కరించినా పట్టించుకోని ఆర్జీవీ.. నిజాయితీ నచ్చిందంటూ కితాబు

RGV

RGV

Director RGV : ఒకప్పుడు స్టార్ హీరోలను సైతం వెయిటింగ్ లిస్టులో ఉంచిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. కొంత కాలంగా మరీ నాసిరకంగా సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.  రీసెంట్ ఆర్జీవీ చేస్తున్న సినిమాలు చూస్తున్న సాధారణ ప్రేక్షకుడు సైతం నిజంగా ఇవి వర్మనే తీస్తున్నాడా అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నాడు. బాలీవుడ్ ను కూడా ఆర్జీవీకి ముందు.. ఆర్జీవీకి తర్వాత అనే స్థాయికి  ఎదిగిన డైరెక్టర్ చేస్తున్న సినిమాలను చూసి వర్మ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. అతని అభిమానులే కాదు.. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా నొసలు చిట్లిస్తున్నారు. మరీ ఇలా తయారవుతున్నాడేంటి అంటూ పెదవి విరుస్తున్నారు.

ఇక ఇంటర్వ్యూలు, ట్విట్టర్ లో అభిమానులతో నిత్యం టచ్ లో ఉండే రామ్ గోపాల్ వర్మను  ఇలాంటి సినిమాలు తీస్తున్నారేంటి అని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నానని, మీకు నచ్చితే చూడండి లేకుంటే లేదు అంటూ మొహం మీదే చెప్పేస్తుంటారు వర్మ. ఆర్జీవీని దేవుడిలా భావించే కొందరు మాత్రం ఆయన మారడు..  మనమే మారాలి అంటూ కొందరు ఆయనను ప్రశ్నించడమే మానేశారు.

ఇక ఆర్జీవీని అభిమానించే ఓ డైరెక్టర్ మాత్రం ఊరుకోలేకపోయాడు. ఆర్జీవీ తీసిన ఓ సినిమాను చూసిన డైరెక్టర్ తట్టుకోలేకపోయాడు. ఇక లాభం లేదనుకొని మందు తాగాక ఫోన్ చేసి చెడామడా తిట్టేశాడు. నీ స్థాయికి తీసే సినిమానేనా ఇది అని బండబూతులు తిట్టేశాడు. అయితే  సదరు డైరెక్టర్ ఒకప్పుడు ఆర్జీవీ శిష్యుడు కావడం విశేషం. తన దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ దూషించినా ఒక్క మాట కూడా అనలేదు. సినిమా బాగా లేదు. తను నిజాయితీగా ఆ విషయాన్ని చెప్పాడని ఆర్జీవీ కూడా సర్ది చెప్పడం గమనార్హం. అయితే ఆ శిష్యుడు ఎవరో కాదు. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి.  ఇటీవల పాయల్ రాజ్ పూత్ తో మంగళవారం అనే సినిమా చేసి హిట్టు కొట్టాడు. ఈ అజయ్ భూపతి ఒకప్పుడు ఆర్జీవీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్ గా పని చేసి డైరెక్టర్ అయ్యాడు.

TAGS