JAISW News Telugu

RGV Vyuham:రిలీజ్ డౌటేనా? RGV `వ్యూహం`కి కోర్టు ఝ‌ల‌క్!

RGV Vyuham:ఆర్జీవీ వ్యూహం ప్ర‌కంప‌న‌ల గురించి తెలిసిందే. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలో వివాదాస్ప‌ద కంటెంట్ పై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రానున్న ఎన్నిక‌ల వేళ ఆర్జీవీ తేదేపా-జ‌న‌సేన‌ల్ని టార్గెట్ చేసి వ్యూహం చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఇటీవ‌ల ఆర్జీవీ ప్లాన్ చేసిన జ‌గ‌గ‌ర్జ‌న ఎపిసోడ్ గురించి తెలిసిందే. తాజాగా ఆర్జీవీ త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, త‌న‌ను చంపేందుకు కొంద‌రు దుండ‌గులు నా ఆఫీస్ పై దాడి చేసార‌ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసారు.

ఇప్పుడు వ్యూహంకి సంబంధించిన కోర్టు తీర్పుపై చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రంపై టీడీపీ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబును కించపరిచేలా ఉన్న రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సూరేపల్లి నంద మంగళవారం విచారించారు.

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపిస్తూ.. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో సినిమాలు నిర్మించడం, విడుదల చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేందుకు వ్యూహకర్తలు, దర్శకులు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల భావప్రకటన స్వేచ్ఛకు, గౌరవంగా జీవించే హక్కుకు మధ్య సమతుల్యతను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు.

ఈ వివాదాస్ప‌ద సినిమా విడుదలను నిలిపివేస్తూ హైదరాబాద్ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, అయితే ఈ నెల 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నార‌ని, కానీ సినిమాను విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది కోర్టును కోరారు. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా.. సెన్సార్ బోర్డు వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 29న సినిమా విడుదల కానున్నందున 28న విచారణ జరిపి, అంతకు ముందే వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది.

Exit mobile version