JAISW News Telugu

Revantha Reddy:తెలంగాణ ఆషామాషీగా ఏర్ప‌డిన రాష్ట్రం కాదు:సీఎం రేవంత్ రెడ్డి

Revantha Reddy:కాంగ్రెస్ పెద్ద‌లు, సీనియ‌ర్ నాయ‌కులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మాజీ ముఖ్య‌మంత్రులు, కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో త‌ర‌లిరాగా ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రెండ‌వ ముఖ్య‌మంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌గా అందులో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ఆరు గ్యారంటీల ఫైల్‌పై తొలి సంత‌కం..

తెలంగాణ సీఎంగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి రెండు ముఖ్య‌మైన ఫైల్స్‌పై సంత‌కాలు చేశారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్ర‌కారం ఆరు గ్యారంటీల ఫైల్‌పై తొలి సంత‌కం చేశారు. ఆ త‌రువాత దివ్యాంగురాలు ర‌జినీకి ఇచ్చిన మాట ప్ర‌కారం ఉద్యోగ నియామ‌క ఫైల్‌పై మ‌లి సంత‌కం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జైసోనియ‌మ్మా..జైజై సోనియ‌మ్మా.. అంటూ త‌న ప్ర‌సంగాన్ని మొద‌లు పెట్టిన రేవంత్ రెడ్డి `మిత్రులారా..ఈ తెలంగాణ రాష్ట్రం ఆషా మాషీగా ఏర్ప‌డిన రాష్ట్రం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్ప‌డింది.

తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్ప‌డింది. ఎన్నో ఆకాంక్ష‌ల‌ను ఎన్నో ఆలోచ‌న‌ల‌ను, ప్ర‌జాస్వామ్యాన్ని పున‌రుద్ధ‌రించి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛనివ్వాల‌ని, సామాజిక న్యాయం చేయాల‌ని అసిఫాబాద్ నుంచి మొద‌లు పెడితే అలంపూర్ వ‌ర‌కు.. ఖ‌మ్మం నుంచి మొద‌లు పెడితే..కొడంగ‌ల్ వ‌ర‌కు స‌మాన‌మైన అభివృద్ధి చేయాల‌న్న ఆలోచ‌న‌తో శ్రీ‌మ‌తి సోనియా గాంధీ గారి ఉక్కుతో సంక‌ల్పంతో కాంగ్రెస్ పార్టీ స‌మిధ‌గ మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ ద‌శాబ్ద కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం హ‌త్య‌కు గురై మాన‌వ హ‌క్కుల‌కు భంగం క‌లిగి ఈ ప్రాంతంలో ప్ర‌జ‌లు చెప్పుకోడానికి ప్ర‌భుత్వం నుంచి వినేవాళ్లు లేక ద‌శాబ్ద కాలంగా మౌనంగా భ‌రించిన ఈ నాలుగ కోట్ల తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ ఆలోచ‌న‌ను ఉక్కు సంక‌ల్పంగా మార్చి ఈ ఎన్నిక‌ల‌లో ఎన్నో త్యాగాలు చేసి త‌మ ర‌క్తాన్ని చెమ‌ట‌గ మార్చి భుజాలు కాయ‌లు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెంగాను మోసి ఈ నాడు ప్ర‌జారాజ్యాన్ని ప్ర‌జ‌ల ప‌రిపాల‌న‌ను ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్ర‌మాణ స్వీకారం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థుల‌కు, నిరుద్యోగుల‌కు, ఉద్య‌మ కారుల‌కు, అమ‌ర వీరుల కుటుంబాల యొక్క ఆకాంక్ష‌ను నెర‌వేర్చ‌డానికి ఈనాడు ఇంద‌ర‌మ్మ రాజ్యం ప్ర‌తిన‌బూనింది.

ఈ ఇందిర‌మ్మ రాజ్యం ఏర్పాటు ప్ర‌క్రియ‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ వ‌చ్చింది. ఈ మంత్రి వ‌ర్గంతో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సామాజిక న్యాయం జ‌రుగుతుంది. ఈ ప్ర‌భుత్వ ఏర్పాటుతో తెలంగాణ న‌లుమూల‌లా స‌మాన‌మైన అభివృద్ధి జ‌రుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌మాణ స్వీక‌రాం ఇక్క‌డ మొద‌లైనప్పుడే అక్క‌డ గ‌డీగా నిర్మించుకున్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెల‌ను బ‌ద్ద‌లు కొట్టించ‌డం జ‌రిగింది. ఈ రోజు ఈ వేదిక మీది నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఈ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా మీకు మాట ఇస్తున్నా.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ చుట్టూత ఉన్న ఇనుప కంచెల‌ను బ‌ద్ద‌లు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాల‌నుకున్నా నిర‌భ్యంత‌రంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి ప్ర‌వేశించి త‌మ ఆలోచ‌న‌ను, త‌మ ఆకాంక్ష‌ని, త‌మ అభివృద్ధిని ఎప్ప‌డైనా రాష్ట్ర ప్ర‌భుత్వంతో పంచుకోవ‌చ్చు` అన్నారు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఇనుప కంచెల్ని బ‌ద్ద‌లు కొట్టి…

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ `రాష్ట్ర ప్ర‌భుత్వంలో మీరు భాగ‌స్వాములు. ఈ రాష్ట్ర ప్ర‌భుత్వంలో మీ యొక్క ఆలోచ‌న‌ని ఈ ప్రాంత అభివృద్ధిని మిలితం చేసి సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్య‌త మీ అభిమాన నాయ‌కుడిగా, మీ రేవంత‌న్న‌గా మీ మాట నిల‌బెడ‌తాన‌ని చెప్పి ఈ వేదిక మీది నుంచి మీకంద‌రికి మాట ఇస్తున్నాను మిత్రులారా. ఈనాడుప్ర‌గ‌తి భ‌వ‌న్ చుట్టూ ఉన్న ఇనుప కంచెల్ని బ‌ద్ద‌లు కొట్టినం. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు అక్క‌డ జ్యోతిరావు పూలే ప్ర‌జాభ‌వ‌న్‌లో ప్ర‌జా ద‌ర్బారు నిర్వ‌హిస్తాం, మా తెలంగాణ ప్ర‌జ‌లు ఈ ప్రాంతంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రి హ‌క్కుల‌ను కాపాడ‌టానికి, ఈ న‌గ‌ర అభివృద్ధి కోసం శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉండే మిగ‌తా రాష్ట్రాల‌తోనే కాకుండా ప్ర‌పంచంతోనే పోటీప‌డే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేద వాళ్ల‌కు, నిస్స‌హాయుల‌కు స‌హాయ‌కారిగా ఉంటూ నిస్స‌హాయులు ఎవ‌రు కూడా మాకెవ‌రు లేరు.

మాకు ఏ దిక్కులేదు అనుకునే ప‌రిస్థితులు రానివ్వ‌కుండా మీ సోద‌రుడుగా, మీ బిడ్డ‌గా మీ బాధ్య‌త‌ల‌ను నేను నిర్వ‌హిస్తా. కాంగ్రెస్ ప్ర‌భుత్వం, ఇందిర‌మ్మ రాజ్యం, సోనియ‌మ్మ అండ‌తో మ‌ల్లికార్జున ఖ‌ర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క సూచ‌న‌ల‌తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌దం వైపు న‌డిపించి మేము పాల‌కులము కాదు మేము సేవ‌కుల‌ము ..మీకు సేవ చేయ‌డానికే మీరు మాకిచ్చిన అవ‌కాశం ఈ అవ‌కాశాన్ని బాధ్య‌త‌గా, ఎంతో గౌర‌వంగా..మీరిచ్చిన ఈ అవ‌కాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం విన‌యోగిస్తాన‌ని తెలియ‌జేస్తూ ఈ రోజు ఈ ప్ర‌భుత్వం ఏర్ప‌డటానికి ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌లు త‌మ ప్రాణాల‌ను సైతం త్యాగం చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు త‌ప్ప ఈ మువ్వ‌న్నెల జెండాను వ‌దులుకోలేదు. మీ క‌ష్టాన్ని, మీ శ్ర‌మ‌ను గుర్తు పెట్టుకుంటా. గుండెల నిండ మీరిచ్చిన శ‌క్తిని నింపుకుంటా. ఈ ప‌దేళ్లు క‌ష్ట‌ప‌డిన కార్య‌క‌ర్త‌ల‌ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్య‌త. ఈ రోజు నుంచి మా విద్యార్థి నిరుద్యోగ ఉద్య‌మ కారుల‌కు, అమ‌ర వీరుల కుటుంబాల‌కు న్యాయం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంది. రేపు ఉద‌యం జ్యోతిరావు పూలే ప్ర‌జా భ‌వ‌న్‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హించాల‌ని, దానికి మీరంద‌రూ పెద్ద ఎత్తున ఆమోదం తెల‌పాల‌ని కోరుతున్నా`అని తెలిపారు.

Exit mobile version