CM Revanth : బీజేపీకి అర్థం చెప్పిన రేవంత్..విశాఖలో తెలంగాణ సీఎం క్రేజ్..

CM Revanth

CM Revanth

CM Revanth : ఆంధ్రప్రదేశ్ లో సత్తా చాటడానికి కాంగ్రెస్ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. ఓ వైపు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని దుమ్మెత్తి పోస్తూనే..తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనుకున్న కేంద్ర ఆలోచనపై మండిపడుతూ.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో భారీ సభ పెట్టడమే కాదు.. దానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు ఏపీ చీఫ్ షర్మిల.

ఈ సందర్భంగా సభలో రేవంత్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రశ్నించే గొంతు వైఎస్ షర్మిలా రెడ్డి అని, ఆమె ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. షర్మిలమ్మకు ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని చెప్పారు. షర్మిలమ్మ ఇక్కడికి అధికారం కోసం రాలేదు..ఆంధ్రా ప్రజల పక్షాన పోరాటం కోసం వచ్చారన్నారు.

వైఎస్ఆర్ వారసులు ఎవరనే అపొహలు, అనుమానాలు ఉండొచ్చు.. వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టే వాళ్లే ఆయన నిజమైన వారసులన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారో ఆలోచన చేయాలన్నారు. ఆంధ్రా ప్రాంతంలో ప్రశ్నించే గొంతులు లేవన్నారు..ఢిల్లీ నుంచి మోదీ ఆంధ్రాను పాలిస్తున్నాడన్నారు. పదేళ్లు దాటినా పోలవరం కట్టలేదని, రాజధాని కట్టలేదన్నారు. ఇవాళ రెండు రాష్ట్రాల్లో నాయకులు ఢిల్లీలో వంగి వంగి దండాలు పెట్టే వాళ్లే ఉన్నారన్నారు.

రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు బిడ్డలుగా కలిసే ఉందామన్నారు. బీజేపీ అంటే ఇవాళ ‘‘బాబు, జగన్, పవన్’’. వీళ్లే మోదీ బలం, బలగం అన్నారు. వీళ్లకు ఓటేస్తే మోదీకి వేసినట్టే, ఢిల్లీలో మోదీని నిలదీసే దమ్ము వీళ్లకు లేదన్నారు. అంతా ముత్యాల ముగ్గు బ్యాచ్ అని ఎద్దేవా చేశారు. బాబు, జగన్ కేవలం పాలన కోసమే పనిచేస్తున్నారన్నారు. షర్మిలకు ఆంధ్రా హక్కులు అన్నీ తెలుసని, ఇక్కడ ఉన్న నేతలు అంబోతులు అని కూడా తెలుసని, అయినా ఇక్కడే పోరాటం చేయాలని వచ్చారన్నారు. వైఎస్ఆర్ చిరకాల కోరిక రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయడమేనని, దాని కోసం కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, విశాఖ సభలో రేవంత్ ప్రసంగానికి మంచి స్పందన వచ్చిందనే చెప్పాలి. ఓరకంగా ఆంధ్రాలో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒకింత జోష్ వచ్చినట్టయింది.

TAGS