CM Revanth : రేవంత్ అంకుల్.. మా ప్రాణాలకు రక్షణేది..? చిన్నారుల ప్లకార్డుల ప్రదర్శన
Revanth Uncle : కుక్కల దాడులపై మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధలో చిన్నారులు వినూత్న నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అంకుల్.. కుక్కల దాడుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. చిన్నారుల కంప్లైంట్ పై చర్యలు తీసుకుంటామని పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు.
సఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, ఎమ్మెల్యే వివేక్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణ ఏది అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చిన్నారులు తల్లిదండ్రులతో సహా పోలీస్ స్టేషన్ కు చేరుకుని అధికారులపై ఫిర్యాదు చేశారు. కొంపల్లిలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, దొరికిన వాళ్లని దొరికినట్లు వేటాడుతున్నాయి. కాలనీల్లో ప్రజలు బైటకు రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల వీధికుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందిన ఘటనలు వెలుగుచూశాయి. పెద్ద ఎత్తున పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.