Revanth Reddy : ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. నేటి సాయంత్రం హైదరాబాద్ లో ముఖ్యమంత్రులు ఇద్దరూ విభజన సమస్యలపై చర్చించనున్నారు. అయితే విభజన సమస్యల కన్నా..చంద్రబాబుతో రేవంత్ రెడ్డి వ్యవహరించే తీరు ఎలా ఉంటుందా అని తెలంగాణ వాదులు, రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురుశిష్యుల బంధం గురించి అందరికీ తెలిసిందే. గురుశిష్యులం కాదు..సహచరులమని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పినా తెలంగాణ వాదులు నమ్మరు అనేది తెలిసిన విషయమే.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్, ఆంధ్రాలో వైసీపీని ఓడించి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాయి. రేవంత్, బాబు ఇద్దరూ సీఎంలు అయ్యారు. ఈనేపథ్యంలో విభజన సమస్యల పరిష్కారం నిమిత్తం పరిష్కరించుకుందామని చంద్రబాబు పిలుపునివ్వడం, అందుకు రేవంత్ ఓకే అనడం తెలిసిందే. దీంతో నేటి సాయంత్రం ఇద్దరూ భేటీ కానున్నారు.
వాస్తవానికి ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. ఇద్దరు సీఎంలు. ఇక్కడ ఏ ఒక్కరూ ఎవరికీ తక్కువ కాదు..ఎక్కువ కాదు. సమస్యల పరిష్కారం పేరుతో తమ రాష్ట్ర ప్రయోజనాలను బలి పెడితే మాత్రం.. సదరు రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఇక తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డిపై ప్రత్యేక నిఘా ఉండనే ఉంది. బీఆర్ఎస్ మాత్రమే కాదు సగటు తెలంగాణ వాదులు, బీజేపీ, కాంగ్రెస్ లోని కొందరు సైతం రేవంత్ రెడ్డి తెలంగాణ సమస్యల విషయంలో ఏ మాత్రం కొంచెం అటు ఇటు చేసిన ఊరుకునే పరిస్థితి ఉండదు. రేవంత్ పై తెలంగాణ ద్రోహి ముద్ర పడిపోవడం ఖాయం. ఈ విషయమై సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ సైతం రేవంత్ ను హెచ్చరించారు.
పోలవరం నిర్మిస్తే భద్రాచలం మునిగిపోతుందని ఇప్పటికే బీఆర్ఎస్, తెలంగాణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లో అనుమతులు లేకుండా కొన్ని ప్రాజెక్టులు కట్టారు. వీటిపై పరస్పరం కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదులు సైతం చేసుకున్నాయి. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల రిత్యా ఎలా వ్యవహరిస్తారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. అయితే ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడానికి చంద్రబాబు, రేవంత్ సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారని అందులో సందేహం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.