Revanth Reddy : సినీ ఇండస్ట్రీ పై కోపంగా ఉన్న రేవంత్ రెడ్డి

Revanth Reddy

CM Revanth Reddy

Revanth Reddy : మంత్రి కొండా సురేఖ ఇటీవల మీడియా సమావేశంలో కంట తడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. తనను సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులతో ట్రోల్స్ చేస్తున్నారని మీడియా సాక్షిగా ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈ విధంగా చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఆమె కాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. వివాదంతో సంబంధం లేని నాగార్జున ఫ్యామిలీని కూడా కలిపి ఆరోపణలు గుప్పించారు. తర్వాత ఈ అంశంపై ఆమె తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఈ విషయంపై నాగార్జున న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. వివాదాన్ని ఇంతటితో ఆపేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి స్వయంగా పిలుపునిచ్చారు. అయినా టాలీవుడ్‌లో కొంత మంది ఇప్పటికీ అతిగా స్పందిస్తూనే ఉన్నారు.

తప్పు జరిగింది..దాన్ని సురేఖ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత కూడా సినీ ప్రముఖుల అతి స్పందన కాంగ్రెస్ పెద్దలను కాస్తా ఆగ్రహానికి గురిచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కుక్కిన పేనులా పడి ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం తమ కంటే రోషగాళ్లు లేనట్లుగా వ్యవహరించడంపై కాంగ్రెస్ పెద్దల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వివాదం ముగించాలని పిలుపునిచ్చిన తర్వాత కూడా కొంత మంది చేసిన అతి సీఎం రేవంత్ రెడ్డికి కోపం తెప్పించిందని తెలుస్తోంది.

ఇప్పటికే టాలీవుడ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. గద్దర్ అవార్డుల విషయంలో కలసి రావడం లేదు. కానీ టిక్కెట్ రేట్లపెంపు ఇతర విషయాల కోసం మాత్రం పరుగులు పెడుతూ వస్తున్నారు. ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే మాత్రం ముందుకు వస్తున్నారు. ఇక టాలీవుడ్ విషయంలో సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని.. కఠినమైన మార్గాన్నే తమ ప్రభుత్వం ఎంచుకుంటుందని చెబుతున్నారు. అయితే స్పందన లేకపోవడం. ..లేకపోతే అతిగా స్పందించడం అనే లక్షణాన్ని వదులుకుని తటస్థంగా ఉండే ప్రయత్నం చేస్తే టాలీవుడ్ కు మంచిదన్న సలహాలు సూచనలు వస్తున్నాయి.

TAGS