JAISW News Telugu

Revantha Reddy:రేవంత్ రెడ్డి అనే నేను..ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి

Revantha Reddy:తెలంగాణ ముఖ్య‌మంత్రిగా సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో అశేష అభిమానులు, తెలంగాణ ప్ర‌జ‌లు, కాంగ్రెస్ పెద్ద‌లు, నాయ‌కులు, అధికారుల సాక్షిగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ రేవంత్ రెడ్డితో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అంత‌కు ముందు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల కేరింతల మ‌ధ్య పార్టీ అగ్ర‌నేత సోనియా గాంధీతో క‌లిసి ప్ర‌త్యేక వాహ‌నంలో రేవంత్ వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు.

ఈ సంద‌ర్భంగా `ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. శాస‌నం ద్వారా నిర్మిత‌మైన భార‌త రాజ్యంగం ప‌ట్ల నిజ‌మైన విశ్వాసం, విధేయ‌త చూపుతాన‌ని, భార‌త‌దేశ సార్వ‌భౌమాధికారాన్ని స‌మ‌గ్ర‌త‌ను కాపాడుతాన‌ని తెంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నా క‌ర్త‌వ్యాన్ని శ్ర‌ద్ధ‌తో, అంతఃక‌ర‌ణ చిత్త శుద్దితో నిర్వ‌హిస్తాన‌ని, భ‌యం కానీ, ప‌క్ష‌పాతం కానీ, రాగ‌ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాస‌నాల‌ను అనుస‌రించి ప్ర‌జ‌లంద‌రికి న్యాయం చేకూరుస్తాన‌ని దైవ సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నాను.

రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నా ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన, లేదా నాకు తెలియవ‌చ్చిన ఏ విష‌యాన్ని నా క‌ర్త‌వ్యాల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన మేర‌కే త‌ప్ప ప్ర‌త్య‌క్షంగా గానీ, ప‌రోక్షంగా గానీ ఏ వ్య‌క్తి లేదా వ్య‌క్తుల‌కు తెలియ‌ప‌ర్చ‌న‌ని, లేదా వెల్ల‌డించ‌న‌ని దైవ సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నాను` అని ప్ర‌మాణం చేశారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి పుష్ప‌గుచ్చం అందించి అభినందించారు.

మంత్రులుగా ప్ర‌మాణం చేసింది వీరే…

1) మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క డిప్యూటీ సీఎం

2) ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

3) దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌

4) కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి

5) దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు

6) పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

7) పొన్నం ప్ర‌భాక‌ర్

8) కొండా సురేఖ‌

9) సీత‌క్క (ధ‌న‌స‌రి అన‌సూయ‌)

10) తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు

11) జూప‌ల్లి కృష్ణారావు

మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వంలో కాంగ్రెస్ నేత‌లు, ఇత‌ర పార్టీల‌కు చెందిన ముఖ్య నేత‌లు ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. ఏఐసీసీ అధ్య‌క్షులు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, అగ్ర‌నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మాజీ సీఎంలు, సీనియ‌ర్ నేత‌లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. దీంతో ఎల్బీస్టేడియం ప‌రిస‌రాల్లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Exit mobile version