Revanth Reddy:కేటీఆర్‌పై మరోసారి విచుకుపడ్డ రేవంత్‌రెడ్డి
Revanth Reddy:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాష్ట్ర సచివాలయంలో `ప్రజా పాలన` పేరుతో కీలకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా `ప్రజా పాలన` అప్లికేషన్ ఫామ్‌ను, ప్రజా పాలన లోగోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ` కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అభయ హస్తం ఇవ్వడం ద్వారా ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందులో రెండు పథకాలను అమలుపరిచి మిగతా పథకాల అమలు విషయంలో `ప్రజా పాలన` పేరు మీద గ్రామ సభలు ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ రోజు లోగోను, సంబంధిత అప్లికేషన్ని విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, గౌరవ నీయులు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీమతి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఛీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా అప్లికేషన్లు గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం`అన్నారు.
జనవరి 6 తరువాత కూడా ..
గ్రామ సభల్లో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. పురుషులు, మహిళలకు విడి విడిగా కౌంటర్లు ఓపెన్ చేస్తాం. ఆయా రోజుల్లో రద్దీ వల్ల అప్లీకేషన్ ఇవ్వలేని వారు చింతించాల్సిన అవసరం లేదు. ఆ తరువాత కూడా మండల ఆఫీసుల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మేము ఇవ్వలేకపోయామే..మాకు సమయం లభించలేదే అని ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు. గతంలో గడీల మధ్య జరిగిన పరిపాలనకు భిన్నంగా ప్రజల వద్దకే పాలన అనే విధంగా మీ ప్రభుత్వం మీ ముందుకు వప్తోంది`అని స్పష్టం చేశారు.
కేటీఆర్‌పై సీఎం రేవంత్ విమర్శలు..
ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ కేటీఆర్‌ను కలిసినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమెకు కేటీఆర్ లక్ష సహాయం అందించడం సంతోషం. ఆయన దోచుకున్న రూ.లక్ష కోట్లల్లో బాధితురాలికి రూ లక్ష ఇచ్చారు. ఈ విధంగా మా ప్రజా వాణి పరిష్కారం చూపినట్టే కదా. ఈ పరంగా ప్రజావాణి విజయవంతం అయినట్టే కదా.. కేసీఆర్ హయాంలో 22 కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు కొని దాచిపెట్టారు. మూడోపారి అధికారంలోకి వస్తే వాడుకుందామనుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీలోనూ బావబావమరుదుల ఆరాటమే కనిపించింది` అంటూ సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి.
కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు…
కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ. అర్హులందరికీ త్వరలోనే కార్డులు జారీ చేస్తాం. గ్రామ సభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. అక్కడ రేషన్ కార్డులతో పాటు ఇతర ఎలాంటి ధరఖాస్తు ఫారాలు ఇచ్చినా తీసుకుంటాం. ఆ సమస్యలు తీరుస్తాం. కొత్త రేషన్ కార్డులు త్పకుండా ఇస్తాం. అర్హులైన వారిని గుర్తించి వారికి కార్డులు అందజేస్తాం.
ఉద్యోగాలపై సీఎం కీలక ప్రకటన..
టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు. టీఎస్ పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారు. వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన తరువాత టీఎస్ పీఎస్సీ కొత్త బోర్డును ఏర్పాటు చేస్తాం. అనంతరం ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. టీఎస్ పీఎస్సీ విషయంలో ఏం జరిగిందో మీకు తెలిసిందే` అంటూ గత ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
రేవంత్ నోట జర్నలిస్ట్ రాహుల్ మాట..
సచివాలయంలో జరిగిన ప్రజా పాలన లోగో లాంచ్ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పలువురు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ పిలవగానే ఆయన పేరుని రేవంత్ పలకడంతో అక్కడంతా నవ్వులు విరిశాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్మీట్లో `ఏమయ్యా రాహుల్` అంటూ సంబోధించేవారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో సీనియర్ జర్నలిస్ట్ రాహుల్‌ని సంబోధించడంతో అక్కడున్న జర్నలిస్టులంతా నవ్వేశారు. ఇదిలా ఉంటే రైతు బంధుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతు బంధుకు పరిమితులు ఏమీ లేవని, దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తాం…
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ ప్రయాణం నేపథ్యంలో ఆటోడ్రైవర్లకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అది మేము ముందే ఊహించాం. అందుకే వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని మా మేనిఫెస్టోలో పెట్టాం. వారి వివరాలు సేకరించి ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేస్తాం` అన్నారు. ఇక లంకె బిందెలు ఉన్నాయని వస్తే గత ప్రభుత్వం ఖజానాను ఖాలీ చేసిందని మరోసారి గత కేసీఆర్ ప్రభుత్వంపై పంచ్‌లు వేశారు.