Ex DSP Nalini:నళిని కోసం రేవంత్‌రెడ్డి భలే ఆలోచన..ఎవరీ నళిని?
Ex DSP Nalini:నీళ్లు,నిధులు, నియామకాలే ప్రధాన డిమండ్‌గా తెలంగాణ ఉద్యమం మొదలైంది. కొన్నేళ్ల పాటు నడిచిన ఈ ఉద్యమంలో సబ్బండ వర్ణాలతో పాటు సాధారణ పౌరులు, తెలంగాణ సమాజం అంతా కలిసి ఉద్యమించింది. ఎంత మంది తమ జీవితాలని ఈ ఉద్యమం కోసం త్యాగం చేశారు. కొంత మంది తమ ప్రాణాలని బలిగా ఇస్తే మరి కొంత మంది తాము చేస్తున్న ఉద్యోగాలని త్యాగం చేశారు. ఉద్యమంలో పాల్గొన్నారు. కొంత మంది మా వల్లే తెలంగాణ ఏర్పడిందని, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని చెప్పుకుంటుంటే ఉద్యమం ఓసం త్యాగాలు చేసిన ఎంతో మంది ఇప్పటికీ ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి.
అలాంటి వాళ్లలో చెప్పుకోదగ్గ వ్యక్తి డీఎస్పీ నళిని. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న వేళ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచిన పేరిది. తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమించే నా అన్నాచెల్లెళ్లపై రాఠీని ఝుళిపించలేనంటూ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తను డీఎస్పీగా పని చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. 2012లో చోటు చేసుకున్న ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐపీఎస్ క్యాడర్ అధికారిని ఇలా రాజీనామా చేయడంపై సర్వత్రా చర్చ జరిగింది.
అనంతరం ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నళిని ఢిల్లీలో రెండు సార్లు ప్రత్యేక తెలంగాణ కోసం దీక్షకు సైతం కూర్చున్నారు. తెలంగాణ ఏర్పడింది. దాదాపు పన్నెండేళ్లుగా ఆమె గురించి ఎలాంటి వార్త లేదు. ఆమె గురించి పట్టించుకున్న వాళ్లూ లేరు. గత ప్రభుత్వం కూడా ఆమె గురించి పెద్దగా ఆరాతీయలేదు. ఆమెకు తిరిగి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు తెలంగాణ ఉద్యమం కోసం డీఎస్పీ ఉద్యోగాన్ని వదులుకున్న నళిని మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.
కొత్తగా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి తాజాగా మాజీ డీఎస్పీ నళిని ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న ఇబ్బందులేంటీ? అని సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. నళినికి ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉంటే ఆమెని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీసు శాఖలో అవరోధాలు ఏమైనా ఉంటే అదే హోదాలో ఆమెకు ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో పోలీసు శాఖలో నియామకాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డీఎస్పీ నళిని గురించి రేవంత్‌రెడ్డ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.