Revantha Reddy:తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ నేతలని కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కెసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.
కేసీ వేణుగోపాల్‌తో భేటీ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడానికి వెళ్లారు. అనంతరం సోనియా గాంధీతో భేటీ కానున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా అధిష్టానం పెద్దలకు రేవంత్ రెడ్డి ఆహ్వాం పలుకుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తని ఫిక్స్ చేయడమే కాకుండా ఎల్బీ స్టేడియంను సిద్ధం చేస్తుండటం తెలిసిందే.
గురువారం ఉదయం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తరువాత తొలిసారి ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్లతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
బుధవారం పార్టీ పెద్దలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలవనున్నారు. పార్టీ పెద్దలను తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నారు. అక్కడ పనులు పూర్తి కాగానే మధ్యాహ్నం తరువాత హైదరాబాద్ బయలుదేరనున్నారు.