Revanth Reddy : తెలంగాణ శాసనసభ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతుండగా సీపీఐ నేత ఎమ్మెల్యే సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో హరీశ్ రావు, స్పీకర్ మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కలుగజేసుకుని స్పీకర్ చైర్‌కు ఎవరైనా గౌరవం ఇవ్వాలని అన్నారు. సభా సంప్రదాయాలు తెలిసిన, శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి హరీశ్ రావుకు ఈ విషయం తెలియకపోవడం బాధాకరమన్నారు.
ఇవాళ ఆర్టీసీపై వాడి వేడీగా చర్చ కొనసాగుతోంది. ఆర్టీసీ అంశంపై హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్ రావు గతంలో ఆర్టీసీ కార్మిక గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారని రేవంత్ గుర్తు చేశారు. ఆ పదవీ నుంచి ఆయనను తప్పించలేక ఏకంగా బీఆర్ఎస్ కార్మిక సంఘాలనే రద్దు చేసిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, వారి భవిష్యత్, ప్రజా రవాణా సదుపాయాలు తమ బాధ్యతలనీ ప్రభుత్వం పేర్కొంది.
అంతకు ముందు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్నీ చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని నిర్వాహక నష్టాలనుంచి బయటకు తెచ్చినట్లూ, మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే 2 వేల కోట్ల రూపాయిలను ఆర్టీసీకి అందించినట్లు చెప్పారు. ఆర్టీసీని గత ప్రభుత్వం అన్ని రకాలుగా నిర్వీర్యం చేసిందని మంత్రి ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించిన అంశానికి ప్రాధాన్యత ఉందన్నారు.
కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం 50 రోజుల సమ్మె చేసినప్పుడు వారికి అండగా నిలిచింది సీపీఐ పార్టీయేనని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో 50 వేల మంది ఆర్టీసీ కార్మికులపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చూపుతున్న వివక్షను తట్టుకోలేక డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మబలిదానాలకు పాల్పడితే వారికి అండగా నిలిచింది కమ్యూనిస్టు పార్టీయేనని అన్నారు. అలాంటి వారికి సభలో మాట్లాడే అవకాశం కల్పించడంపై హరీశ్ రావు అసహనం ప్రదర్శించడం సమంజసం కాదన్నారు రేవంత్ రెడ్డి.