CM Revanth Reddy and KVP : ఇటీవల కాలంలో హైడ్రా అంటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చెరువులు, నాలాలను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా హైడ్రా కూల్చివేస్తోంది. కూల్చివేతలకు గురవుతున్న భవనాలను కోల్పోతున్న వారికి తప్ప.. రేవంత్ రెడ్డి – హైడ్రా కాంబినేషన్ లో జరుగుతున్న కూల్చివేతలకు సర్వత్రా మంచి ఆదరణ లభిస్తోంది. చెరువులను, నదులను ఆక్రమించి ఫాం హౌస్‌లు, కన్వెన్షన్ సెంటర్లు కట్టుకున్న సంపన్నులు సహజంగానే ఆగ్రహంతో ఉంటారు. అదే సమయంలో మూసీ నదీతీరం, పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన పేదల్లో అదేస్థాయి వ్యతిరేకత లేదు. వారందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించిన తర్వాతే కూల్చవేతలు చేపడుతూ.. ప్రజాగ్రహానికి దారితీయకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న ఈ యజ్ఞానికి నైతికబలం అందించే పరిణామం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన కేవీపీ రామచంద్రరావుకు కూడా మూసీ తీరంలో ఫాం హౌస్ ఉంది. అక్రమ ఫామ్ హౌస్‌లు కట్టుకున్న బీఆర్ఎస్ నేతల జాబితాను ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కేవీపీ పేరును ప్రస్తావించారు. దీన్ని ఆయన తట్టుకోలేకపోయారు. కాంగ్రెస్‌లో తన చరిత్ర అంటూ రేవంత్ రెడ్డికి చాలా పెద్ద లెటర్ రాశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గుర్తించలేకపోవడం తన దురదృష్టమన్నారు. ఆయన కాంగ్రెస్‌లో పని చేసి.. పదవులు పొందారు. పార్టీని వైఎస్ సొంత ఆస్తిలా మార్చేందుకు సహకరించారు.. కానీ కాంగ్రెస్‌కు చాలా నష్టమే చేశారు. ఆయనేం చేశారన్న విషయం పక్కన పెడితే.. ఆషామాషీగా రేవంత్ రెడ్డి ఆయనను వ్యతిరేకించడం లేదని.. తెర వెనుక చేసిన కుట్రలు తెలుసు కాబట్టే ఆయన అలా మాట్లాడుతున్నారని కొందరు చెబుతున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేవీపీ రామచంద్రరావు హవా నడిచిందని రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టులు.. ఇతర విషయాల్లో కేసీఆర్ కు దిక్సూచీలాగా కేవీపీ ఉన్నారని ఆయనకు పక్కా సమాచారం ఉందంటున్నారు. గతంలో కూడా ఆయన కేవీపీపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దానికి కారణం.. కేవీపీ, కేసీఆర్‌ది ఒకే సామాజికవర్గం. వారిని అది కలిపిందంటున్నారు. కేవీపీ రేవంత్ కు రాసిన లేఖలో తాను కాంగ్రెస్ కు ఎంత సేవ చేశానో చెప్పుకొచ్చారు. తనపై ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టే కేవీపీ ఆ లేఖ ద్వారా రేవంత్ కు క్లారటీ ఇచ్చే ప్రయత్నం చేశారని భావించొచ్చు. అంతకు ముందు పళ్లంరాజు సోదరుడి ఫామ్ హౌస్ కూల్చేసినప్పుడు కూడా హైకమాండ్ రేవంత్ ను అడ్డుకునే ప్రయత్నం చేసిందంటున్నారు. అయితే బీఆర్ఎస్ కు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పళ్లంరాజు చేసిన వ్యాఖ్యలన్నీ రేవంత్ హైకమాండ్ ముందు పెట్టినట్లుగా చెబుతున్నారు. సీనియర్ల పేరుతో కాంగ్రెస్ ను అమ్ముకున్న ప్రతి ఒక్కరి జాతకం రేవంత్ రెడ్డి వద్ద ఉందని ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటున్నారని కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.