Revanth Invited KCR : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కాళేశ్వరం ప్రాజెక్టుపై రచ్చ సాగుతోంది. బీఆర్ఎస్ ఓటమిలో కాళేశ్వరం బ్యారేజీ కుంగుబాటు కూడా కారణమైంది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడమే కాదు శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పిల్లర్స్ కుంగిపోవడం, ఇతర విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అసెంబ్లీ సమావేశాలను ఒకరోజు ముందుగానే ముగించాలని ఈ సందర్భంగా నిర్ణయించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 13వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే ఈనెల 12వ తేదీ వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. 13న కాళేశ్వరం సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్ ను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యతను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్టు సమాచారం. మరోవైపు ఈనెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించబోతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారా? ప్రభుత్వం నుంచి వచ్చే ఆహ్వానాన్ని స్వీకరిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
కృష్ణా జలాలు సమస్యపై కేసీఆర్ ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు కౌంటర్ గా అదే రోజు గోదావరిపై ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణకు గేమ్ ఛేంజర్ గా కేసీఆర్ అభివర్ణించేవారు. దాన్ని కట్టడం ద్వారా తెలంగాణ సస్యశ్యామలం అయిందని చెప్పేవారు.
ఎన్నో లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామనేవారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు పియర్స్ కుంగిపోవడంతో కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు అధికారులు తేల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ను ఇప్పుడే కాదు భవిష్యత్ లోనూ ఇబ్బంది పెట్టేవిధంగా రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. అదే క్రమంలో కాళేశ్వరం టూర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.