Revanth : పెరుగనున్న రేవంత్ ఇమేజ్.. మూడు దశల్లో రైతులకు రుణమాఫీ!
Revanth : రైతులకు రెండు లక్షల రుణమాఫీ అసాధ్యమని, ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. ఎన్ని మార్గదర్శకాలు పెట్టి ఫిల్టర్ చేసినా అమలు చేయడం అసాధ్యం అనుకున్నారు. ఎందుకంటే బీఆర్‌ఎస్ హయాంలో రూ.లక్ష రుణమాఫీ చేసేందుకు కేసీఆర్ ఐదేళ్లు నానాకష్టాలు పడ్డారు. అయితే పూర్తిగా రుణమాఫీ చేయకుండానే ఎన్నికలకు వెళ్లారు. కేసీఆర్ వల్ల కానిది రేవంత్ రెడ్డి వల్ల అవుతుందా అంటూ పలు ప్రశ్నలు వినిపించాయి. అయితే ఆగస్టు 15లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా హామీను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నిధులు అందుబాటులో ఉండడంతో ముందస్తుగా లక్ష రుణాన్ని మాఫీ చేస్తున్నారు. గురువారం సాయంత్రం రైతుల ఖాతాల్లో రూ. లక్ష వరకు డిపాజిట్ చేయనున్నారు.
వాస్తవానికి ఆగస్టు పదిహేనో తేదీని రేవంత్ డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. అదే విషయాన్ని ప్రజలకు చెప్పారు. రూ.రెండు లక్షల రుణమాఫీని కటాఫ్ డేట్ కంటే నెల రోజుల ముందుగానే చేస్తున్నారు. కానీ జూలై ఇరవయ్యో తేదీ కంటే ముందే ఆ ప్రక్రియ ను ప్రారంభించేస్తున్నారు. రూ. లక్ష వరకూ రుణమాఫీ చేయడానికి అవసరమైన నిధులు లభించడంతో.. గురువారమే ఖాతాల్లో జమ చేయనున్నారు. రేవంత్ రెడ్డి గురువారం రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమ చేయనున్నారు. నెలాఖరులో లక్షన్నర లోపు. వచ్చే ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ పూర్తవుతుంది. నిధుల సేకరణపై స్పష్టమైన లక్ష్యంతో పూర్తి చేయడం చాలా కష్టం కాదు. రెండు లక్షలు అంటే చిన్న మొత్తం కూడా కాదు. రైతు కుటుంబాలకు ఎన్నో సమస్యల పరిష్కారం చేస్తాయి.
ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డికి రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై విమర్శలు, నిరుద్యోగుల ఆందోళనలు, ప్రతి చిన్న విషయానికి కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలతో రేవంత్ రెడ్డికి చికాకుగా మారాయి. నిరుద్యోగుల ఆందోళనలను పెద్దగా చూపించే ప్రయత్నం చేశారు. కొంపదీసి కొందరి ఆశావహుల కోసం వాయిదా వేస్తే.. లక్షల మంది అసంతృప్తికి గురవుతారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతున్న తరుణంలో రేవంత్ ఒక్కసారిగా రుణమాఫీ ప్రకటించారు. రేవంత్ ప్రకటనతో మిగతా సమస్యలన్నీ తొలగిపోనున్నాయి. రాజకీయంగా ధీటుగా అడుగులు వేయడంలో రేవంత్ రెడ్డి ప్రత్యేకత ఉంది. ఇంత కాలం నిధులు ఉండవు. .. రుణమాఫీ విషయంలో వెనకడుగు వేస్తారని రేవంత్ భావించారు. కానీ 30 వేల కోట్లు రుణమాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో రైతుల మనసుల్లో రేవంత్ రెడ్డి మరో మెట్టెక్కేశారు.