CM Revanth : అండగా నిలిచిన వారికి రేవంత్ అందలం.. సీఎం సలహాదారుగా నరేందర్ రెడ్డి..

Narender Reddy as CM's advisor

Narender Reddy as CM’s advisor

CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవుల పంపకానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి నియమించారు. ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ ను నియమించారు. మల్లు రవికి ఢిల్లీ కీలక హోదా కేటాయించారు. ఈ నెలాఖరులోగా మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీపై రేవంత్ కసరత్తు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ గా ఉన్న సమయం నుంచి తనకు అండగా నిలిచిన వారికి రేవంత్ ప్రాధాన్యమిస్తూ కీలక బాధ్యతలు అప్పజెప్తున్నారు.

ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు కేటాయించారు. ఇప్పుడు సలహాదారుల పదవులు ఖరారు చేశారు. రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి సలహాదారు హోదా కేటాయించారు. నరేందర్ సీఎం వ్యవహారాలను కేబినెట్ హోదాలో నిర్వహిస్తారు. పార్టీలో సీనియర్ మైనార్టీ నేత షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు హోదాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖలు అప్పగించారు. కేబినెట్ లో మైనార్టీ మంత్రి లేకపోవడంతో షబ్బీర్ అలీకి సలహాదారు హోదాలో ఈ బాధ్యతలను అప్పగించారు. హర్కర వేణుగోపాల్ కు ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ అప్పగిస్తూ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. రేవంత్ కు తొలి నుంచి మద్దతుగా  నిలిచిన మల్లు రవికి ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. గతంలోనూ మల్లు రవి ఇదే హోదాలో పనిచేశారు.

రేవంత్ రెడ్డితో  నరేందర్ కు దాదాపు 16 ఏండ్ల స్నేహం ఉంది. టీడీపీలో ఇద్దరూ కలిసే పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా రేవంత్ ఎన్నికయ్యారు. ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతలిద్దరి మధ్య స్నేహబంధం బలపడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ నియోజకవర్గం ఎస్టీ కోటాలోకి వెళ్లిపోయింది.

2015లో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో నామినేట్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్ సన్ వద్దకు రేవంత్ వెళ్లారు. అప్పుడు జరిగిన విషయాలన్నీ మనకు తెలిసిందే. కష్టకాలంలో రేవంత్ వెంట నరేందర్ ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి పలు కార్యక్రమాల్లో నరేందర్ రెడ్డి కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఎన్నికల టైంలో కూడా రేవంత్ కు చేదోడు వాదోడుగా నరేందర్ నిలిచారు.

తనకు అండగా ఉంటున్న మిత్రుడికి సీఎం సలహాదారుగా కీలక బాధ్యతలు అప్పజెప్పారు. మిగతా ముగ్గురికి కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఇక మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ నియామకంపై ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

TAGS