New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..యాక్షన్ ప్లాన్ ఇదే..
New Ration Cards : తెలంగాణ ప్రజలు రేషన్ కార్డుల కోసం కండ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ, మార్పులు,చేర్పులకు అవకాశం ఇవ్వకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు పలు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త రేషన్ కార్డులు, మార్పులు, చేర్పుల కోసం ప్రజాపాలనలో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరందరికీ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
మొన్న మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో కొత్త రేషన్ కార్డుల జారీకి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డు కీలకం కావడంతో మరిన్ని పేద కుటుంబాలకు మేలు జరగాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 20లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్లు అన్నింటినీ స్క్రూట్నీ చేసి.. తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఆహార భద్రతా కార్డులకు అర్హులని నిర్ధారణ జరిగిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో ఈ ఫిల్టరింగ్ జరుగనుంది.
ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి, సొంత ఇల్లు, కారు ఉన్న వారికి, ఇన్ కం ట్యాక్స్ చెల్లించే వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోరని తెలుస్తోంది. దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులు, జీవన విధానాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే రేషన్ కార్డు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి తర్వాత అతి త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.