Result of Intoxication : మత్తు ఫలితం.. రూ. 30 కోట్ల నష్టం

Result of Intoxication

Result of Intoxication

Result of Intoxication : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదానికి కారణం మద్యం పార్టీ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఆల్కహాల్ పార్టీలో ఈ అగ్నిప్రమాదం అనుకోకుండా జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీ చేసుకుంటున్న సమయంలో సిగరెట్, ఆల్కహాల్ అనుకోకుండా అంటుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

విశాఖపట్నం బోట్ హార్బర్‌లో ఆదివారం అర్థరాత్రి సుమారు ఒంటి గంట నుంచి రెండు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగి ఉంటుందనే అంచనాకు వచ్చినట్ల తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో బోట్లు కాలిపోయాయి. ముందుగా ఒక బోటు నుంచీ మంటలు మొదలై.. అవి మిగతా వాటికి వ్యాపించాయని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారని సమాచారం.

ఈ ప్రమాదంలో దాదాపు 40కి పైగా బోట్లు అగ్నికి అహుతయ్యాయి. కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నా.. అవి వేటకు ఇక పనికిరాని స్థితికి చేరుకున్నాయి. ఈ నష్టం ఇప్పటి వరకు దాదపు రూ. 30 కోట్లకు పైనే ఉంటుందని మత్స్యశాఖ అధికారులు, వైసీపీ మత్స్యకార సంఘ నాయకులు, పోలీసులు పేర్కొంటున్నారు.

ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత కొందరు మత్స్యకార యువకులు బోటుపై కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ.. మందు పార్టీ (మద్యం పార్టీ) చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు మత్తులోకి జారుకున్న  తర్వాత సిగరెట్.. మద్యం అక్కడే వదిలిసి వెళ్లడంతో ఇవి ప్రమాదవశాత్తూ అంటుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అలా ఒక బోటులో చెలరేగిన మంటలు మిగతా వాటికి వ్యాపించి మొత్తం 40 కి పైగా బోట్లు కాలి బూడిద అయ్యాయని భావిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కోలా గురువుల ఘటనా స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. అటు సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా మత్స్యకారులకు బాసటగా ఉంటామని చెప్పారు. ప్రతిపక్ష బీజేపీ, టీడీపీ నేతలు కూడా మత్స్యకారులను పరామర్శించి ఓదార్చారు. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

 బోట్లలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఉండడంతో మంటలు వేగంగా ఇతర బోట్లకు వ్యాపించాయని  అందువల్లే ఆస్తినష్టం ఎక్కువగా ఉందని తెలుస్తుంది.  తమను ఆదుకోవాలనీ, తమకు ఆ బోట్లే ఆధారమని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.

TAGS