CM Revanth : కాళేశ్వరం బ్యారేజీకి మరమ్మతులు.. సీఎం సంచలన నిర్ణయం
CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సచివాలయంలో మధ్యాహ్నం మొదలైన మంత్రి మండలి సమావేశం దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగింది. కేంద్ర ఎన్నికల సంఘం కేబినెట్ భేటీకి అంక్షలతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో కేవలం అత్యవసర అంశాలపై మాత్రమే ఈ సమావేశంలో చర్చించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లపై సీరియస్‌గా చర్చించిన కేబినెట్.. వరి కొనుగోళ్ల బాధ్యత పూర్తిగా కలెక్టర్లకు అప్పగించడంతో పాటు, ఏ రైతుకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలంటూ అధికారులను ఆదేశించారు.
దాంతో పాటు ఈ భేటీలో ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్నాయని.. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని మంత్రివర్గం నిర్ణయించింది. రైతులకు నష్టం జరగకుండా.. కనీస మద్దతు ధరకు ఒక్కరూపాయి కూడా తగ్గకుండా.. చివరిగంజ వరకు ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. నకిలీ విత్తనాలు చెక్ పెట్టేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ఎస్డీఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా మంత్రివర్గంలో చర్చించారు. తాత్కాలికంగా మరమ్మతులు చేసైనా సరే రైతులకు నీరందివ్వాలని మంత్రి వర్గసమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. గత దశాబ్ధకాలంలో విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ విస్మరించిందని.. తమ మార్క్ ఏంటో చూపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బడుల్లో మౌళిక సదుపాయల విషయాల్లోనూ తగ్గేదేలేదన్నారు.