Renu Desai : పవన్ కల్యాణ్ తో కలిసి కాపురం చేసుకొంటున్నప్పటి కంటే విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాతే రేణూ దేశాయ్ ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆమె గురించి జనం, ఫ్యాన్స్, మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తూనే ఉంటారు. రేణూ ఏం మాట్లాడినా, ట్వీట్ చేసినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ మధ్య రేణూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త హల్ చల్ చేసింది. రేణూ మాటలు, చేష్టలు అలాగే అనిపించాయి కూడా. కానీ ఆ తర్వాత అలాంటి అలికేడేం కనిపించలేదు. వినిపించలేదు. ఇప్పుడు మళ్లీ రేణూ నోట రెండో పెళ్లి ప్రస్తావన వచ్చింది.
ఇంట్లో వాళ్ల ఒత్తిడితో రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పటికీ, తన కూతురి జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆ ఆలోచన విరమించుకొన్నానని క్లారిటీ ఇచ్చారు రేణూ. ఆద్య ఇంకా స్కూల్ కు వెళ్లే దశలోనే ఉందని, తనకు కాలేజీకి వెళ్లే వయసు వస్తే, పరిపక్వతతో ఆలోచించగలదని, అలాంటి తరుణంలో తనని అన్ని విధాలుగా అర్థం చేసుకుంటుందని, అప్పటివరకూ పెళ్లి ప్రస్తావన రానివ్వకూడదని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు.
గతంలో ఇంట్లో వాళ్లు ఓ సంబంధం తీసుకొచ్చారని, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. నిశ్చితార్థం చేసుకుందామని కూడా భావించారని, అయితే ఆద్య గురించి ఆలోచించి, ఆ ప్రతిపాదన పక్కన పెట్టామని రేణూ అంటున్నారు. భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటారా? అని అడిగితే మాత్రం సమాధానం కచ్చితంగా చెప్పలేదు కానీ రేణూ మాటలు వింటుంటే ఆ అవకాశాలు ఉన్నట్లే అనిపిస్తోంది. ఇంట్లో వాళ్ల ఇష్టమే తన ఇష్టమని, వాళ్లు ఇప్పటికీ తన పెళ్లి గురించి ప్రస్తావిస్తునే ఉంటారని చెప్పుకొచ్చింది రేణూ.