Nagarjuna University : నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు

Nagarjuna University YSR statue
Nagarjuna University : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్యూ)లో విద్యార్థుల ఆందోళనతో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. సోమవారం లెక్చరర్లు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీలో రాజకీయ నాయకుల విగ్రహాలు తొలగించాలని ఆందోళన చేపట్టారు. యూనవర్సిటీలోని వైఎస్సార్ విగ్రహం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.
యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం తగదని, వైఎస్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ తనకుకొంత సమయం కావాలని, ఉన్నతాధికారులను సంప్రదించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ విగ్రహం తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నం వీసీ రాజశేఖర్ వర్సిటీ నుంచి వెళ్లిపోయారు. అనంతరం వర్సిటీ ఇంజనీరింగ్ అధికారులు జేసీబీతో వైఎస్ విగ్రహాన్ని తొలగించారు.