Welfare Scheme Funds : ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన డీబీటీ నిధుల పైన హైకోర్టు స్పష్టతనిచ్చింది. ఎన్నికల తరువాత నిధుల విడుదల చేయాలనే ఎన్నికల సంఘం ఆదేశాల పైన హైకోర్టు ఒక్క రోజు స్టే విధించింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఎలాంటి నిధులను విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. దీంతో ఈ ఒక్క రోజులోనే నగదు విడుదలకు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో కొన్ని షరతులు విధించింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలన్న ఈసీ నిర్ణయంపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాదీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం ఇన్‌పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఎన్నికల సంఘం ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. నిధుల విడుదల చేయవద్దన్న ఈసీ ఆదేశాలను తాత్కాలికంగా ఇవాళ వరకు నిలుపుదల చేస్తూ తీర్పునిచ్చింది. నిధుల పంపిణీ విషయాన్ని ప్రచారం చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఇందులో నేతల జోక్యం ఉండొద్దని, ప్రచారం చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమయ్యే అవకాశాలన్నారు. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో డీబీటీల పంపిణీకి లైన్ క్లియర్ అయింది. గత 59 నెలలుగా లబ్ధి పొందుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది హైకోర్టు. విద్యార్థులు, మహిళలు వేసిన పిటిషన్ పై సానుకూలంగా స్పందిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించకూడదని ఈసీకి టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అవసరమైతే పోలింగ్ తరువాత బదిలీ చేయాలని సూచించింది. అలాగే పోలింగ్ కు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల ఓటర్లు ప్రలోభానికి గురయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడింది. దీనిపై స్పందించిన ఈసీ డీబీటీ ద్వారా నిధులు విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీకి వివరణ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నామని ఇది ఇప్పటికిప్పుడు తీసుకొచ్చిన పథకం కాదంటూ చెప్పుకొచ్చారు. పైగా 58 నెలలుగా ప్రలోభానికి గురవ్వని వారు కేవలం.. ఈ ఒక్కసారి మాత్రమే ప్రలోభానికి ఎలా గురవుతారని ప్రశ్నించారు. దీనిపై ఈసీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో కొందరు విద్యార్థులు, మహిళలు, లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు. తమకు గత నాలుగున్నరేళ్లుగా అందుతున్న లబ్ధికి అడ్డుపడుతున్నారని పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు ఈసీకి పలు ఆదేశాలు జారీ చేసింది.