Akkineni Nagarjuna : మూడు నెలల్లో సినిమా రిలీజ్.. పిచ్చిపట్టిందని చై, అఖిల్ అన్నారు..
Akkineni Nagarjuna : నట సామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా ‘నా సామి రంగ’. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతోనే విజయ్ బిన్నీ దర్శకత్వాన్ని ప్రారంభించారు. సంక్రాంతి బరిలో మంచి పేరు తెచ్చుకుంది. సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ మీట్ కు కింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కింగ్ అన్న మాటలు వైరల్ గా మారాయి.
మూవీ సక్సెస్ అయినందున టీమ్ తో పాటు తన అభిమానులు, సినీ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ 2023, సెప్టెంబర్ 20న నాన్న గారి జయంతి రోజు అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వర్ రావు విగ్రహం ఆవిష్కరించాం. ఆ రోజే మూవీ లాంచ్ చేద్దామని చెప్పాను. ఒక వైపు విగ్రహం ఆవిష్కరణ, మరోవైపు పూజా కార్యక్రమాలు. నేను పూజా కార్యక్రమానికి వెళ్తుంటే నా భార్య అమల ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది.’
‘అప్పటి వరకు కూడా నేను సినిమాను కమిట్ అయ్యానని చెప్పలేదు. సినిమా లాంచ్ ఈవెంట్ కు వెళ్లాలని చెప్పా.. ఇప్పుడు అవసరమా కాస్త ఆలస్యంగా వెళ్లండని చెప్పింది. కాదు సంక్రాంతికి విడుదల చేయాలని చెప్పడంతో నాగ చైతన్య, అఖిల్ నీకేమైనా పిచ్చి పట్టిందా అన్న విధంగా నన్ను చూశారు. ఇంత తక్కువ సమయంలో సినిమా ఎలా విడుదల చేస్తారంటూ అందరూ ఆశ్చర్యపోయారు కానీ టీమ్ మాత్రం దీన్ని బలంగా నమ్మింది. ప్రతి ఒక్కరూ నవ్వుతూనే తక్కువ సమయంలో సినిమాను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.’ అని నాగార్జున చెప్పారు. ఇలా కింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.